Maldives: అక్రమ వ్యాపారాలు చేస్తున్నారంటూ.. 43 మంది భారతీయులను వెనక్కి పంపిన మాల్దీవుల ప్రభుత్వం
- బంగ్లా, నేపాలీ, శ్రీలంక వాసులు సహా మొత్తం 186 మంది డిపోర్ట్
- వీసా వయోలేషన్ సహా పలు నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణ
- అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతున్న ద్వీపదేశం
వీసా రూల్స్ ఉల్లంఘన సహా పలు నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మాల్దీవుల ప్రభుత్వం 43 మంది భారతీయులను వెనక్కి పంపించింది. దేశంలో అక్రమ వ్యాపారాలు, డ్రగ్స్ దందాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీలలో వివిధ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి స్వదేశానికి పంపించింది. మొత్తంగా 186 మంది విదేశీయులను వెనక్కి పంపగా.. అందులో ఎక్కువ శాతం బంగ్లాదేశీయులే ఉన్నారని హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.
వీసా మానిప్యులేషన్, గడువు తీరినా అక్రమంగా దేశంలోనే ఉండడం, డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి వారి వారి దేశాలకు పంపించామని వివరించారు. ఇలా వెనక్కి పంపిన వారిలో బంగ్లాదేశీయులు 83 మంది, భారతీయులు 43 మంది, శ్రీలంక పౌరులు 25 మందితో పాటు ఎనిమిది మంది నేపాలీయులు ఉన్నట్లు పేర్కొన్నారు.