Manikonda: క్రికెట్ గ్రౌండ్‌కు అడ్డంగా ఉన్నాయని 40 చెట్ల నరికివేత.. వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
- జేఎన్టీయూ-కూకట్‌పల్లి ఫ్లైవోవర్ నిర్మాణం సందర్భంగా 100 చెట్ల తొలగింపు
- వాటిని మణికొండ శ్మశాన వాటిక, క్రికెట్ గ్రౌండ్ వద్ద నాటిన వాటా ఫౌండేషన్
- వాటిలో 40 చెట్ల నరికివేత
- తమకు చెబితే వేరే చోటికి తరలించేవారమంటూ హైకోర్టులో పిల్
- విచారణ మార్చి 6కు వాయిదా
హైదరాబాద్ నగరంలోని మణికొండలో క్రికెట్ గ్రౌండ్‌కు అడ్డుగా ఉన్నాయన్న కారణంతో 40 చెట్లను నరికివేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జేఎన్టీయూ- కూకట్‌పల్లి ఫ్లైవోవర్ నిర్మాణం సందర్భంగా 2017లో వంద చెట్లను కొట్టేయాల్సి వచ్చింది. దీంతో వాటిని అక్కడి నుంచి పెకలించి తీసుకొచ్చి మణికొండ శ్మశానవాటిక, క్రికెట్ గ్రౌండ్ వద్ద నాటారని, అందులో 70 చెట్లు బతికితే వాటిలో 40 చెట్లను అధికారులు అనుమతులు లేకుండానే నరికేశారంటూ వాటా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి. ఉదయ్‌కృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. చెట్ల నరికివేత విషయాన్ని ముందే తమకు చెప్పి ఉంటే తాము మరో చోటికి తీసుకెళ్లి నాటి ఉండేవాళ్లమని, తమ సంస్థ సేవలు ఉచితమని తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్ బెంచ్ ఈ పిటిషన్ ను నిన్న విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం చెట్ల నరికివేతపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి, బల్దియా కమిషనర్, మణికొండ మున్సిపల్ కమిషనర్, పురపాలక శాఖ డైరెక్టర్ ఫల్గుణ కుమార్, మణికొండ మాజీ సర్పంచ్ కె.నరేందర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.