Electoral Bonds: రాజ్యాంగ విరుద్ధం.. ఎలక్ట్రోరల్ బాండ్స్ పై సుప్రీం సంచలన తీర్పు!

Supreme Court big verdict in electoral bond case

  • క్విడ్ ప్రో కో కు దారితీయొచ్చని ఆందోళన
  • ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలను మార్చ్ 31 లోగా వెబ్ సైట్ లో ఉంచాలని ఎన్నికల సంఘానికి ఆదేశం 
  • రెండు వేర్వేరు తీర్పులు వెలువరించిన సుప్రీం ధర్మాసనం

రాజకీయ పార్టీలు సేకరించే విరాళాలలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్స్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. బ్లాక్ మనీ నిర్మూలన పేరుతో తీసుకొచ్చిన ఈ విధానంలో పారదర్శకత లోపించిందని వ్యాఖ్యానించింది. ఆర్టీఐ పరిధిలో నుంచి ఎలక్ట్రోరల్ బాండ్స్ ను తప్పించడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు కూడా ఓ భాగమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఏ పార్టీకి ఎవరు విరాళం ఇస్తున్నారనే విషయం తెలుసుకోవడం ద్వారా ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలో తేల్చుకునే వీలు కలుగుతుందని చెప్పారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ‘క్విడ్ ప్రో కో’ కు దారితీయవచ్చని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

బ్లాక్ మనీని అరికట్టడం, విరాళాలు అందించే వ్యక్తులు, సంస్థల గోప్యతను కాపాడటమే లక్ష్యంగా ఎలక్ట్రోరల్ బాండ్స్ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, నల్ల ధనాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ జారీని వెంటనే నిలిపివేయాలని, ఇప్పటి వరకు జారీ చేసిన బాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సీజేఐ ఆదేశించారు. రాజకీయ పార్టీలకు చెందిన ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలను మార్చ్ 31 లోగా వెబ్ సైట్ లో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి 2న ఎలక్ట్రోరల్ బాండ్స్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు అందించే నగదు విరాళాల స్థానంలో ఈ బాండ్స్ జారీ విధానాన్ని ప్రవేశ పెట్టింది. విరాళాల సేకరణ కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్ బాండ్స్ జారీ చేసే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తుంది. రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వాలని భావించే వ్యక్తులు, సంస్థలు ఆయా పార్టీలు జారీ చేసే బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బాండ్లు ఎవరు, ఎన్ని కొనుగోలు చేశారనే వివరాలను పార్టీలు రహస్యంగా ఉంచవచ్చు. అయితే, ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ జారీపై కాంగ్రెస్ నేత జయ థాకూర్ తో పాటు సీపీఎం పార్టీ, ఎన్జీవో సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. బాండ్స్ చట్టవిరుద్ధమని, వీటి జారీపై స్టే విధించాలని కోర్టును కోరాయి.

ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు.. సుదీర్ఘ విచారణ చేపట్టాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తో పాటు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత గతేడాది నవంబర్ 2న సుప్రీం బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం ఈ కేసులో తీర్పు వెలువరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు రెండు వేర్వేరు తీర్పులు వెలువరించారు.

  • Loading...

More Telugu News