Sarfaraz Khan: సర్ఫరాజ్‌కు టెస్ట్ క్యాప్ ప్రెజెంటేషన్.. కన్నీళ్లు పెట్టుకున్న కుటుంబం.. స్టేడియంలో ఉద్విగ్నత
- భారత జట్టుకు ఆడాలన్న సర్ఫరాజ్ కల నేడు నెరవేరిన వైనం
- కుమారుడికి టెస్ట్ క్యాప్ అందించగానే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి నౌషద్
- కుమారుడిని ఆలింగనం చేసుకుని క్యాప్‌కు ముద్దిచ్చిన తండ్రి
- కన్నీటిని ఆపుకోలేకపోయిన భార్య
- సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్
దేశానికి ప్రాతినిధ్యం వహించాలని సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌ఖాన్ కల నేటితో నెరవేరింది. 26 ఏళ్ల సర్ఫరాజ్ రాజ్‌కోట్‌లో నేడు ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో బరిలోకి దిగుతున్నాడు. తుది జట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు. కుమారుడు మైదానంలో దిగుతున్నప్పుడు చూడాలని ఆరాటపడిన సర్ఫరాజ్ కుటుంబం కూడా రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు చేరుకుంది.
కుమారుడి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సర్ఫరాజ్ తండ్రి నౌషద్, ఆయన భార్య కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే టెస్టు క్యాప్ అందివ్వగానే ఆనందం పట్టలేక ఇద్దరూ ఆనందబాష్పాలు రాల్చారు. క్యాప్ ప్రెజెంటేషన్ తర్వాత కుమారుడిని నౌషద్ ఆలింగనం చేసుకుని క్యాప్‌కు ముద్దిచ్చారు. ఆనందంతో కన్నీళ్లు చెక్కిళ్లపై నుంచి జలజలా రాలాయి.
సర్ఫరాజ్ భార్య కూడా కన్నీటిని ఆపుకోలేకపోవడం కనిపించింది. సర్ఫరాజ్ బలవంతంగా కన్నీటిని అదిమిపెట్టుకున్నాడు. ఇది చూసి మైదానం మొత్తం ఉద్విగ్నతకు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, సర్ఫరాజ్‌తోపాటు ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు.