Bandi Sanjay: అయోధ్యను కాంగ్రెస్ వ్యతిరేకించింది... అందుకే గాంధీ కుటుంబం ఎన్నికలను ఎదుర్కోలేక రాజ్యసభకు వెళుతున్నారు: బండి సంజయ్

Bandi Sanjay talks about sonia gandhi rajya sabha

  • కాంగ్రెస్ దేశంలో ఎక్కడా లేదన్న బండి సంజయ్
  • కేసీఆర్ తన భాషను ప్రారంభించాడు... కాంగ్రెస్‌కే నష్టమన్న బీజేపీ ఎంపీ
  • త్వరలో బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపిన బండి సంజయ్

అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠను బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు బహిష్కరించారని... అందుకే గాంధీ కుటుంబం నేరుగా ఎన్నికలను ఎదుర్కోలేక రాజ్యసభ నుంచి ఎంపీ అవుతున్నారని ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'అయోధ్య రాములవారి ప్రాణప్రతిష్ఠను బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు కూడా బహిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అందుకే గాంధీ కుటుంబం నేరుగా ఎన్నికలను ఎదుర్కోలేక రాజ్యసభ నుంచి ఎంపీ అవుతున్నారు' అన్నారు. నిన్న సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బండి సంజయ్ పైవిధంగా మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ కోవర్టులు, కేసీఆర్ తదితరులు కలిసి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తారన్నారు. తాము ఎప్పుడూ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీతో కలవలేదని... కానీ ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని గతంలో పలుమార్లు పోటీ చేశాయని గుర్తు చేశారు. బీజేపీ వారితో ఎప్పుడూ కలవలేదన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా వారు ఏకమయ్యారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అవినీతి కారణంగానే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు.

కేసీఆర్ తన భాషను ప్రారంభించాడు... కాంగ్రెస్‌కే నష్టం

కేసీఆర్ మళ్లీ తన భాషను ప్రారంభించాడని... అలా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకే నష్టమన్నారు. అక్కడ ఏపీలో కొందరు హైదరాబాద్ రాజధాని పేరిట మాట్లాడితే... ఇక్కడ కేసీఆర్ తన కట్టె కాలే వరకు తెలంగాణ కోసం కొట్లాడుతానని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు... కేసీఆర్ లేకుంటే హైదరాబాద్‌ను ఆంధ్రావాళ్లు ఆక్రమించుకుంటారనే అభిప్రాయం కలిగించడమే వారి ఉద్దేశ్యం అన్నారు. ఇదంతా కేసీఆర్ ప్లాన్ అన్నారు. కానీ కాంగ్రెస్ దీనిని గ్రహించడం లేదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ కుంగిపోవడానికి ఎల్ అండ్ టీ కారణమా? మరొకరు కారణమా? అనే విషయాలు తెలియాలన్నారు.

త్వరలో బస్సు యాత్ర

ఈ నెల 20వ తేదీ నుంచి తెలంగాణలో బీజేపీ బస్సు యాత్ర ప్రారంభించనుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రజలను బస్సు యాత్ర ద్వారా కలుస్తామన్నారు. ఈ బస్సు యాత్ర సమయంలో తెలంగాణకు కేంద్రం చేసిన వాటిని ప్రజలకు చెబుతామన్నారు.

  • Loading...

More Telugu News