Farooq Abdullah: ఇండియా కూటమికి మరో షాక్ ఇచ్చిన ఫరూక్ అబ్దుల్లా.. ఈడీ ఎఫెక్టేనా?
- వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఫరూక్ అబ్దుల్లా ప్రకటన
- ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత
- ఇటీవలే ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసిన ఈడీ
అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమికి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి వారు కూటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఇండియా కూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మరో షాక్ ఇచ్చారు.
రానున్న ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. సొంత బలంపైనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు, ప్రశ్నలకు తావు లేదని అన్నారు.
ఇండియా కూటమి ఏర్పాటులో ఫరూక్ అబ్దుల్లా కీలక పాత్రను పోషించిన విషయం గమనార్హం. ఇండియా బ్లాక్ అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, ఆయన చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు, కూటమితో కలిసి వెళ్లకుండా, ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయానికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఇంకోవైపు, ఫరూక్ అబ్దుల్లాకు ఇటీవలే ఈడీ సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై సమన్లు పంపింది. క్రికెట్ అసోసియేషన్ నిధులు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లు, సంబంధం లేని అకౌంట్లకు మళ్లాయని ఈడీ ఆరోపించింది. అసోసియేషన్ అకౌంట్ల నుంచి అనుమానాస్పదమైన క్యాష్ విత్ డ్రాలు జరిగాయని కేసులో ఈడీ పేర్కొంది. అయితే, ఈ సమన్లపై ఈడీకి ఈమెయిల్ ద్వారా ఫరూక్ అబ్దుల్లా సమాధానం ఇచ్చారు. తాను టౌన్ లో లేకపోవడం వల్ల ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆయన తెలిపారు.