Tirumala: సూర్యప్రభ వాహనంపై శ్రీవారి ఊరేగింపు.. వీడియో ఇదిగో!
- తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
- ఉదయం 5:30 గంటలకు వాహనసేవ
- ఏడు టన్నుల పూలతో ఆలయంలో అలంకరణ
కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవం కోసం మహాద్వారం నుంచి స్వామి వారి సన్నిధి వరకు పుష్పాలంకరణ చేశారు. దాదాపు 7 టన్నుల పుష్పాలను, 50 వేల కట్ ఫ్లవర్స్ ను ఉపయోగించి సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి వాహనసేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై అర్చకులు శ్రీవారిని ఊరేగించారు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట తర్వాత గరుడ వాహనం, మధ్యాహ్నం 2- 3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.