UPI: నేపాల్ లోనూ మన యూపీఐ సేవలు
- ఆ దేశ జాతీయ బ్యాంకుతో ఆర్బీఐ ఒప్పందం
- యూపీఐ - ఎన్ పీఐ లింకేజ్ ఏర్పాట్లు
- ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాల్లో యూపీఐ పేమెంట్స్
పొరుగు దేశం నేపాల్ లోనూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) సేవలను భారతీయులు వినియోగించుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (ఎన్ ఆర్ బీ) తో ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. నేపాల్ లో ప్రస్తుతం వినియోగిస్తున్న నేషనల్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (ఎన్ పీఐ), యూపీఐల మధ్య లింకేజ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
త్వరలోనే పొరుగు దేశంలో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. దీంతో ప్రపంచంలోని ఏడు దేశాలలో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అయిందని తెలిపింది. భూటాన్, ఒమన్, మారిషస్, శ్రీలంక, నేపాల్, ఫ్రాన్స్, యూఏఈ దేశాలలో పర్యటించే భారతీయులు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐలతో చెల్లింపులు జరిపే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది.