Nara Lokesh: మీరు చొక్కాలు మడతపెడితే... మేం కుర్చీలు మడతపెట్టడమే!: నారా లోకేశ్
- ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం యాత్ర
- నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారా లోకేశ్
- పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక
- జగన్ కు దమ్ముంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. నేడు నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ వైసీపీ నాయకత్వంపై నిప్పులు చెరిగారు.
పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బూమ్ బూమ్ బ్యాచ్ చొక్కాలు మడతపెడితే... మేం కుర్చీలు మడతపెట్టడమే అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో మద్య నిషేధం తర్వాతే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడేమని అడుగుతారు? అంటూ నిలదీశారు. ఏపీలో ఉన్న వైసీపీ బ్యాచ్ అంతా బ్లేడ్ బ్యాచ్ అని విమర్శించారు.
రాష్ట్రంలో ఉన్న రాజధానిని నాశనం చేసి మరో రెండేళ్లు హైదరాబాదులో కులుకుతామంటున్నారు... మీకసలు సిగ్గుందా? అని మండిపడ్డారు. జగన్ కు దమ్ముంటే ఓసారి యువత వద్దకు వెళ్లాలని లోకేశ్ సవాల్ విసిరారు.
జగన్ ఇప్పుడు రైతులన్నా భయపడిపోతున్నాడని, రాజధాని ఫైల్స్ సినిమా అంటే హడలిపోతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులు అన్నారు... ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా? అని ప్రశ్నించారు.