Telangana: కులగణన తీర్మానానికి తెలంగాణ శాసన సభ ఆమోదం
- సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు తీర్మానం ప్రవేశపెట్టిన పొన్నం
- తీర్మానంపై చర్చించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు
- తీర్మానంపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటన
కులగణన తీర్మానానికి తెలంగాణ శాసన సభ ఆమోదం తెలిపింది. తెలంగాణలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ తీర్మానంపై చర్చించాయి. ఈ తీర్మానానికి చట్టబద్ధత ఉంటేనే ఫలప్రదమవుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచన చేసింది. కులగణన కోసం బిల్లు తీసుకువస్తే తమ పార్టీ మద్దతిస్తుందని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.
విపక్షాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కులగణనకు బీఆర్ఎస్ చెప్పినట్లుగా కావాల్సింది బిల్లు మాత్రమే కాదని... చిత్తశుద్ధి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తీర్మానంపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.