Bandi Sanjay: బండి సంజయ్, రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం

Vinod Kumar fires at Bandi Sanjay Revanth Reddy

  • బండి సంజయ్ ఎంపీ హోదాలో ఉండి సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శ
  • బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా ఒక్క నవోదయను సాధించలేకపోయారని వ్యాఖ్య
  • బండి సంజయ్ తన పాదయాత్రలో వ్యక్తిగత దూషణలు మానుకోవాలని సూచన
  • సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్య

కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌పై కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజన్న సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ హోదాలో ఉండి సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని... ఇది పద్ధతి కాదని హితవు పలికారు. ఉపాధి హామీ, హరితహారం, అంగన్‌వాడీ, ప్రధానమంత్రి సడక్ యోజన పథకాలకు కేంద్రం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను తాను తెచ్చినట్లుగా ఎంపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా పథకాలు అందరికీ వస్తాయన్నారు.

ఐదేళ్ల పదవీ కాలంలో కరీంనగర్‌ పార్లమెంట్ పరిధిలో కనీసం జాతీయ రహదారి తెచ్చారా? ట్రిపుల్ ఐటీలు, నవోదయ స్కూల్స్, పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు, పవర్‌లూం కస్టర్ అయినా తెచ్చావా? అని బండి సంజయ్‌ని నిలదీశారు. కానీ తాను 2014-19 వరకు ఎంపీగా ఉన్న సమయంలో కేంద్రం నుంచి ఎన్నో నిధులు తీసుకువచ్చానన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ పార్టీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా ఒక్క నవోదయను సాధించలేకపోయారన్నారు. రాజకీయ పదవులు వస్తుంటాయ్‌.. పోతుంటాయని.. ఎవరూ శాశ్వతం కాదన్నారు.

బండి సంజయ్ తన పాదయాత్రలో వ్యక్తిగత దూషణలు మానుకోవాలని సూచించారు. తాను, తన భార్య కష్టార్జితంతో ఆస్తులు కూడబెట్టుకున్నామన్నారు. హైదరాబాద్‌లో తనకు రూ.500 కోట్ల ఆస్తి ఎక్కడ ఉందో బండి సంజయ్ ఆస్తిపత్రాలు తీసుకువస్తే సంతకం పెడతానన్నారు. ఎంపీ హోదాలో ఉండి అవాస్తవాలు మాట్లాడడం సరికాదన్నారు. అలాగే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. యాసంగి పంటకు రూ.500 బోనస్ ఇస్తున్నారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు.  

గత ప్రభుత్వ హయాంలో కానిస్టేబుల్, స్టాఫ్ నర్సులు, గురుకుల ఉపాధ్యాయల పోస్టుల భర్తీ కోర్టు కేసుల ద్వారా నిలిచిపోయానని తెలిపారు. 25వేల ఉద్యోగాలను ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక 60 గ్రూప్-1 పోస్టులను మాత్రమే జత చేశారని.. ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. వాటిని ఎప్పుడు గుర్తిస్తారో చెప్పాలన్నారు. డిసెంబర్ చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News