Nagababu: ఎవరు ఎంత గింజుకున్నా జనసేన-టీడీపీ ఓట్ షేర్ చీల్చలేరు: నాగబాబు
- ఏపీలో త్వరలో ఎన్నికలు
- జనసేన, టీడీపీ మధ్య పొత్తు
- అయోమయానికి గురిచేసే ప్రయత్నం జరుగుతోందన్న నాగబాబు
- పొత్తు విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ ధీమా
ఏపీలో ఎన్నికల వాతావరణం వాడీవేడిగా మారుతోంది. నాయకుల వ్యాఖ్యలు మరింత పదునెక్కుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి ఎన్నికల్లో జనసేన-టీడీపీ క్యాడర్ ఓట్ల బదిలీ తథ్యం అని స్పష్టం చేశారు.
టీడీపీ అభ్యర్థులు నిలబడిన చోట జనసేన కార్యకర్తలు ఓట్లు వేయరని.... జనసేన అభ్యర్థులు నిలబడిన చోట టీడీపీ సహకరించదని ప్రచారం జరుగుతోందని అన్నారు. రెండు పార్టీల శ్రేణులను అయోమయానికి గురిచేయడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎవరేమనుకున్నా, ఎవరు ఎంత గింజుకున్నా జనసేన-టీడీపీ ఐక్య ఓట్ షేర్ ను చీల్చలేరని స్పష్టం చేశారు. పొత్తు విజయాన్ని అడ్డుకోలేరని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని దించే క్రమంలో ఒక ఉమ్మడి భావజాలంతో పార్టీలు ముందుకెళుతున్నప్పుడు క్యాడర్ కానీ, వాళ్లకు ఓట్లేసే వాళ్లు కానీ కలిసివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్డీయే కూటమిలోనూ, ఇండియా కూటమిలోనూ అనేక పార్టీలు ఉన్నాయని... ఎవరి ఓటు బ్యాంకు వారికి ఉంటుందని, ఓట్లు చీలే ప్రసక్తే లేదని నాగబాబు ఉద్ఘాటించారు. ఏపీలోనూ జనసేన, టీడీపీ పొత్తులో ఎలాంటి గందరగోళం లేదని అన్నారు.