Arvind Kejriwal: ఎట్టకేలకు ఈడీ కోర్టు విచారణకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ
- ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు
- ఇప్పటివరకు కేజ్రీవాల్ కు ఆరు సార్లు నోటీసులు
- అరెస్ట్ తప్పదంటూ వార్తలు
- నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ ఆరు సార్లు సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ఇప్పటివరకు విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు.
అయితే, ఈడీ అధికారులు అరెస్ట్ కు సన్నాహాలు చేస్తున్నారన్న నేపథ్యంలో... కేజ్రీవాల్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ కోర్టు విచారణకు హాజరయ్యారు. నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం కేజ్రీవాల్ తన న్యాయవాది ద్వారా కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్ర బడ్జెట్, విశ్వాస తీర్మానం కారణంగా ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుకాలేకపోయానని వివరణ ఇచ్చారు. మార్చి 16న జరిగే విచారణకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని తెలిపారు.
అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్
అరెస్ట్ వార్తల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో నిన్న విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సభలో బలపరీక్ష నిర్వహించారు. ఈ విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ నెగ్గారు.
ఢిల్లీ అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా... 54 మంది మద్దతు పలికారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఓటు వేశారు. మిగతా ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరైనట్టు తెలుస్తోంది.
విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, బీజేపీ ప్రయత్నాలను బయటపెట్టేందుకే తీర్మానం ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.
ఏ ఒక్క ఆప్ ఎమ్మెల్యే కూడా తనను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. 54 మంది తనను బలపరిచారని, ఇద్దరు ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారని, మిగతా వారు ఇతర ప్రాంతాల్లో ఉండడం వల్ల నేటి విశ్వాస పరీక్షకు హాజరు కాలేకపోయారని కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు.