Medaram Jathara: మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన
- ఈ నెల 21 నుంచి 24 వరకు నడవనున్న ప్రత్యేక రైళ్లు
- స్పెషల్ ట్రైన్స్‌తో పాటు జాతర నిర్వహణకు కేంద్రం రూ.3 కోట్లు ఇస్తోందని వెల్లడి
- సిర్పూర్ కాగజ్‌నగర్ - వరంగల్ - సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్ - సికింద్రాబాద్ - వరంగల్, నిజామాబాద్ - వరంగల్ - నిజామాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క - సారక్క జాతర కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21న ప్రారంభం కానున్న ఈ జాతర కోసం భక్తులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మేడారం జాతరకు వెళ్లనున్న భక్తుల సౌకర్యార్థం ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు నడపడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. గిరిజన వర్గాల సంక్షేమానికి పాటుపడతామని ఆయన అన్నారు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లతో పాటు జాతర నిర్వహణకు కేంద్రం రూ.3 కోట్లు అందించనుందని వెల్లడించారు.
07017/07018: సిర్పూర్ కాగజ్‌నగర్ - వరంగల్ - సిర్పూర్ కాగజ్‌నగర్, 07014/07015: వరంగల్ - సికింద్రాబాద్ - వరంగల్, 07019/0720: నిజామాబాద్ - వరంగల్ - నిజామాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, హైదరాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భోంగీర్, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరుతో పాటు పలు కీలకమైన స్టేషన్లలో ఆగనున్నాయి. కాగా తెలంగాణలోని ములుగు జిల్లా పరిధిలో వన దేవతలు సమ్మక్క సారక్కల జాతర జరుగుతుంది. పెద్ద సంఖ్యలో తరలి రానున్న భక్తులకు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు ఉపయోగపడనున్నాయి.