CPI Ramakrishna: బీజేపీతో పొత్తు ఆ రెండు పార్టీలకే కాకుండా రాష్ట్రానికి కూడా అరిష్టం: సీపీఐ రామకృష్ణ
- తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని జగన్ ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని రామకృష్ణ విమర్శ
- జగన్ ను ఇంటికి పంపించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
- రైతులకు ఇచ్చిన ఏ హామీని మోదీ అమలు చేయలేదని మండిపాటు
ఏపీలో టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు ఆ పార్టీలకే కాకుండా రాష్ట్రానికి కూడా అరిష్టమని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్ ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. అమరావతికి ఆమోదం తెలిపి... అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ డ్రామా చేశారని... ఇప్పుడు ఉమ్మడి రాజధాని అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీలో జగన్ పని అయిపోయిందని రామకృష్ణ అన్నారు. రాష్ట్రాన్ని పాలించడానికి జగన్ అనర్హుడని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కేసీఆర్ ను ఇంటికి పంపించారని... ఇప్పుడు జగన్ ను ఇంటికి పంపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కర్నూలు న్యాయ రాజధాని ప్రపోజల్ ను జగన్ కనీసం ఢిల్లీకి కూడా పంపించలేదని విమర్శించారు.
రైతులకు ఇచ్చిన ఏ హామీని ప్రధాని మోదీ అమలు చేయలేదని రామకృష్ణ అన్నారు. పదేళ్ల పాలనలో దేశాన్ని మోదీ అప్పులపాలు చేశారని విమర్శించారు. 156 లక్షల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. రైతులు రోడ్డెక్కకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలను విధించిందని చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు రైతుల ఉద్యమం ఆగదని అన్నారు.