Nara Bhuvaneswari: చంద్రబాబు తెచ్చిన చీరపై నారా భువనేశ్వరి ఏమన్నారో చూడండి!
- చంద్రబాబుకు ప్రజలే ముఖ్యమన్న నారా భువనేశ్వరి
- ప్రజల తర్వాతే భార్య, కుటుంబం అని వెల్లడి
- తాను అడిగిన 30 ఏళ్లకు ఓ చీర తెచ్చారన్న భువనేశ్వరి
- ఆ చీర చూడగానే హార్ట్ అటాక్ వచ్చినంత పనైందని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి ఆసక్తికర అంశం వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషి అని... ఆయనకు భార్య, కుటుంబం కూడా పట్టదని, ఎవరైనా ప్రజల తర్వాతేనని అన్నారు. నిజం గెలవాలి యాత్ర సందర్భంగా ఓ కార్యక్రమంలో భువనేశ్వరి ప్రసంగించారు.
"ఆయనతో ఎప్పుడో ఒకసారి అన్నాను... ఆడవాళ్లకు వాళ్ల భర్తలు ఏవైనా తీసుకువస్తారు... మీరేమీ తీసుకురారు అన్నాను. నేను ఆ మాట అడిగిన 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు ఒక చీర తెచ్చారు. ఆ చీర చూడగానే నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. ఎందుకంటే ఆ చీర అంత ఘోరంగా ఉంది. ఆ రంగులు ఏం బాగాలేవు. కానీ నాకోసం తెచ్చారన్న భావనతో ఎంతో సంతోషం కలిగింది. నా మొగుడు నాకో చీర తెచ్చాడని దాన్ని జాగ్రత్తగా బీరువాలో దాచుకున్నాను. అది కూడా ఆయన ప్రేమతో తెచ్చారు గనుక!" అంటూ భువనేశ్వరి వివరించారు. ఆమె వ్యాఖ్యల వీడియోను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.