Harish Rao: రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి... మాపై ఇంకో రూపంలో బురద జల్లండి.. కానీ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయండి: హరీశ్ రావు
- ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ నేతల గారడీ అంటూ విమర్శ
- నీటి పారుదలపై విడుదల చేసింది వైట్ పేపర్ కాదు... ఫాల్స్ పేపర్ అని ఆగ్రహం
- తప్పులను ఎత్తి చూపితే ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని వ్యాఖ్య
మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి... కానీ మాపై బురద జల్లాలనుకున్నా... ఇంకో రూపంలో విమర్శలు చేయాలనకున్నా చేయండి... కానీ మేడిగడ్డ ప్రాజెక్టుకు ఈ వానాకాలం లోపు పూర్తి మరమ్మతులు నిర్వహించి సేఫ్ జోన్‌లోకి తీసుకురావాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శాసనసభ నిరవధిక వాయిదా అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ నేతలు గారడీ చేస్తున్నారని విమర్శించారు. నీటి పారుదలపై శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పూర్తిగా తప్పుల తడక అన్నారు. అది వైట్ పేపర్ కాదు... ఫాల్స్ పేపర్ అని విమర్శించారు.
శ్వేతపత్రంలోని తప్పులను ఎత్తి చూపితే ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వ్యవహారాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుకు మరమ్మతులు ఆలస్యం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. కేఆర్ఎంబీ విషయంలోనూ శ్వేతపత్రం విడుదల చేసి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవన్నారు.