Israel: ఇజ్రాయెల్‌లో హమాస్ నరమేధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
- ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులు ఉగ్రవాదమేనని వ్యాఖ్యానించిన జైశంకర్
- గాజాలో దాడుల విషయంలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలని సూచన
- ఇరు దేశాల మధ్య శాశ్వత పరిష్కారం అవసరమని భారత్ వైఖరిని స్పష్టం చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్
- జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ జరిపిన దాడులను ‘ఉగ్రవాదం’గా ఆయన అభివర్ణించారు. ఇక గాజాలో ఇజ్రాయెల్ దాడులను ప్రస్తావిస్తూ.. ఇజ్రాయెల్ కూడా అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని, వాటిని పాటించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పౌరుల ప్రాణనష్టం విషయంలో ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జైశంకర్ సూచించారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సదస్సులో భాగంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బోక్ సమక్షంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
హమాస్ చెరలో ఉన్న బంధీలను తప్పనిసరిగా వెనక్కు తీసుకురావాలని జైశంకర్ ఆకాంక్షించారు. ఇక పాలస్థీనా - ఇజ్రాయెల్ మధ్య పరిస్థితుల ఉపశమనం కోసం మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాశ్వత పరిష్కారం అవసరమని, లేదంటే తిరిగి ఇలాంటి పరిస్థితులే పునరావృతం అయ్యే అవకాశం ఉంటుందని జైశంకర్ అభిప్రాయపడ్డాడు.
పాలస్తీనా సమస్య విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా ఇరుదేశాలు అడుగులు వేయాలని భారత్ కొన్ని దశాబ్దాలుగా సూచిస్తోందని భారత్ వైఖరిని జైశంకర్ స్పష్టం చేశారు. కొత్త దేశాల ఏర్పాటు అంశం మునుపటిలా కాకుండా ప్రస్తుతం ‘అత్యవసరం’గా పరిణమించాయని ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో నేడు చాలా దేశాల మధ్య పరిష్కారం అవసరం ఉందని ఆయన ప్రస్తావించారు.