Earth From Space: వజ్రపు తునకలా మెరుస్తున్న భూమి.. ఫొటో తీసి పంపిన నోవా-సి లాండర్

Earth shines like a gem in first stunning images sent by IM 1 lander
  • చంద్రుడిపైకి వెళుతున్న తొలి ప్రైవేట్ ల్యాండర్
  • ఈ నెల 15న ప్రయోగం.. 22న చంద్రుడిపై దిగనున్న వ్యోమనౌక
  • అంతరిక్షంలోకి చేర్చిన ఫాల్కన్ 9 రాకెట్లు
చంద్రుడిపైకి అమెరికా పంపించిన తొలి ప్రైవేట్ ల్యాండర్ ‘నోవా-సి’ ప్రస్తుతం మార్గమధ్యంలో ఉంది. ఈ నెల 15న కేప్ కానవెరాల్ లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్లు ఈ ల్యాండర్ ను అంతరిక్షంలోకి చేర్చాయి. అటుపై ల్యాండర్ చంద్రుడివైపు దూసుకెళుతోంది. ప్రయాణంలో ఈ ల్యాండర్ తీసి పంపిన ఫొటోలను అమెరికా కంపెనీ ఇనిషియేటివ్ మెషిన్ (ఐఎం) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భూమి వజ్రపు తునకలా మెరిసిపోతూ కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందనేది గతంలో చాలా ఫొటోలు చూసినా నోవా- సి పంపిన ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు.

నోవా-సి ల్యాండర్ ఈ నెల 22న చంద్రుడిపై దిగనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుడిపై దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్ గా నోవా-సి, తొలి కంపెనీగా ఇనిషియేటివ్ మెషిన్స్ చరిత్ర సృష్టిస్తాయి. అంతేకాదు, 1972 తర్వాత చంద్రుడిపైకి అమెరికా పంపిన తొలి ల్యాండర్ గా ఇది రికార్డులకెక్కనుంది. చంద్రుడిపైకి మరోసారి మానవ సహిత వ్యోమనౌకలను పంపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆర్టెమిస్ మూన్ ప్రోగ్రామ్ ను చేపట్టింది. ప్రస్తుతం పంపించిన నోవా- సి ల్యాండర్ ఈ ప్రాజెక్టులో తొలి అడుగు అని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



Earth From Space
NASA
Moon Mission
NOVA Lander
USA

More Telugu News