APPSC: ఓకే రోజు గ్రూప్-2 ప్రిలిమ్స్, ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్షలు.. ఏది రాయాలో తెలియక అభ్యర్థుల అయోమయం
- ఈ నెల 25న ఒకేసారి రెండు పరీక్షలు
- ఏ పరీక్షకు హాజరు కావాలో నిర్ణయించుకోలేకపోతున్న అభ్యర్థులు
- హాల్ టికెట్లు తమకు పంపితే ఎస్బీఐ అధికారులతో మాట్లాడి మరో స్లాట్లో పరీక్ష నిర్వహించేలా చూస్తామన్న ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో ఏ పరీక్ష రాయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఈ నెల 25న ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్ష జరగనుండగా అదే రోజు గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్పీ ప్రకటించింది. దీంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు ఏ పరీక్షకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియక గందరగోళంలో పడిపోయారు.
నిజానికి తేదీలు ఖరారు చేయడానికి ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థల ద్వారా జరిగే పరీక్షలు, వాటి తేదీలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత ఏపీపీఎస్సీ పరీక్షల తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ హడావుడిగా గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించడం గందరగోళానికి దారితీసింది.
ఎస్బీఐ నోటిఫికేషన్ కొత్తగా ఏమీ విడుదల కాలేదు. నవంబరులోనే నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరి 25న మెయిన్స్ ఉంటుందని ప్రకటించింది. ఆ తర్వాత నెల రోజులకు అంటే డిసెంబరు7న గ్రూప్-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని తెలిపింది. గ్రూప్-2 కోసం 4.5 లక్షలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రెండు పరీక్షలు ఒకే రోజు ఉండడంతో ఏ పరీక్షకు హాజరుకావాలో తెలియక ఇప్పుడు అభ్యర్థులు డైలమాలో పడిపోయారు.
విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ఏపీపీఎస్సీ ఎస్బీఐ క్లరికల్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను పంపించాలని కోరింది. పరీక్ష విషయంలో ఎస్బీఐ ఉన్నతాధికారులను సంప్రదించామని, తమకు 10 మంది అభ్యర్థులు హాల్టికెట్లు పంపారని, మార్చి 4న (మరో స్లాట్) మరోమారు పరీక్ష నిర్వహించేందుకు ఆమోదించారని పేర్కొంది. ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఉంటే వారు కూడా తమకు 19వ తేదీ లోగా హాల్ టికెట్లు పంపాలని, ఆ వివరాలను కూడా వారికి పంపి పరీక్ష తేదీల మార్పునకు కృషి చేస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను [email protected]కు పంపాలని సూచించింది.