Marco Troper: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ కుమారుడు ట్రోపర్ అనుమానాస్పదస్థితిలో మృతి
- డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే మృతి చెంది ఉంటాడని అనుమానం
- కాలిఫోర్నియా యూనివర్సిటీ డార్మిటరీలో మృతదేహం గుర్తింపు
- అతడు డ్రగ్స్ తీసుకున్నాడన్న ట్రోపర్ బామ్మ
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడి వయసు 19 సంవత్సరాలు. మంగళవారమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియా యూనివర్సిటీ డార్మిటరీలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అతడి మృతికి గల కారణాలు తెలియరాలేదు. అలాగని అనుమానాస్పదంగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు.
అయితే, డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే అతడు మృతిచెంది ఉండొచ్చని ట్రోపర్ బామ్మ ఎస్తర్ వోజ్కికీ అనుమానం వ్యక్తం చేశారు. అతడు డ్రగ్స్ తీసుకున్నాడని, అయితే అది ఏరకమైనదో తెలియదని పేర్కొన్నారు. టాక్సికాలజీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ట్రోపర్ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఇందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.