Nara Lokesh: విశాఖను విషాదపట్నంగా మార్చేశారంటూ జగన్ పై లోకేశ్ ఫైర్
- అప్పుడు చంద్రబాబు నెలకో ఐటీ కంపెనీని సిటీకి తీసుకొచ్చారు..
- ఇప్పుడేమో రోజుకో హత్య, భూ కుంభకోణం జరుగుతున్నాయని విమర్శ
- విశాఖ తూర్పు నియోజకవర్గంలో శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం
విశాఖపట్నంను ఐటీ క్యాపిటల్ గా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే.. జగన్ ప్రభుత్వం సిటీని గంజాయి క్యాపిటల్ గా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీని నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. ఈమేరకు ఆదివారం విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగించారు.
నాడు చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీని విశాఖకు తీసుకొస్తే.. ప్రస్తుతం జగన్ పాలనలో నగరంలో రోజుకో హత్య, కిడ్నాప్, కుంభకోణం జరుగుతున్నాయని లోకేశ్ ఆరోపించారు. విశాఖను విషాదపట్నంగా మార్చేశారని జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖ ఉక్కు కంపెనీ విషయంలో జగన్ లాలూచి పడ్డారని, కంపెనీని ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితే, దీనిని టీడీపీ అడ్డుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేందుకు చర్యలు చేపడతామన్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ వివరించారు.
నగరానికి రైల్వే జోన్ తెస్తా.. మెట్రో ప్రాజెక్టు తీసుకొస్తానని ఇచ్చిన హామీలను జగన్ మర్చిపోయారని లోకేశ్ ఎద్దేవా చేశారు. అయితే, సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, మహిళలకు రూ.1500 అందిస్తామని లోకేశ్ వివరించారు.