Narendra Modi: నా మీద కోపంతో దేశానికి నష్టం చేయవద్దని కాంగ్రెస్ ను కోరుతున్నా: ప్రధాని మోదీ

Modi appeals Congress party do not harm nation by being angry with him

  • ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశాలు
  • నేడు రెండో రోజు సమావేశాలకు కూడా హాజరైన ప్రధాని మోదీ
  • వచ్చే 100 రోజులు బీజేపీకి ఎంతో కీలకమని వెల్లడి
  • బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలని సూచన

ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశాలు నేడు రెండో రోజు కూడా కొనసాగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాలకు హాజరై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... వచ్చే 100 రోజులు బీజేపీకి ఎంతో కీలకం అని స్పష్టం చేశారు. నవభారత్ నిర్మాణం కోసం అహర్నిశలు పని చేద్దాం అని పిలుపునిచ్చారు. 

బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ, ప్రతి ఓటరు వద్దకు వెళ్లాలని సూచించారు. బీజేపీకి ఎందుకు ఓటేయాలో ప్రతి ఒక్కరికీ వివరించాలని తెలిపారు. ఈసారి 400 సీట్లు దాటాలనే నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. బీజేపీకి యువశక్తి, నారీ శక్తి, కిసాన్ శక్తి ప్రధాన బలం అని మోదీ పేర్కొన్నారు. 

అధికారంలోకి రావాలన్న కోరిక తప్ప కాంగ్రెస్ వద్ద ఏముంది?

కాంగ్రెస్ చరిత్ర ఎలాంటిదో, ఏమిటో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు పుట్టినిల్లు. దేశంలోని అనేక అనర్థాలకు కారణం కాంగ్రెస్ పార్టీయే.  కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కూటమికి దశ, దిశ లేదు. 

అధికారంలోకి రావాలన్న కోరిక తప్ప దేశాభివృద్ధికి కాంగ్రెస్ వద్ద అజెండా లేదు. దేశాభివృద్ధిపై దృష్టి  పెట్టే తీరిక కాంగ్రెస్ పార్టీకి లేదు. దేశ రక్షణ, రక్షణ దళాల  సామర్థ్యం పెంపు పైనా కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు. కాంగ్రెస్ ఎప్పుడూ మన సైనిక దళాల సామర్థ్యాన్ని శంకిస్తూ ఉంటుంది. నా మీద కోపంతో దేశానికి నష్టం చేయవద్దని కాంగ్రెస్ ను కోరుతున్నా.

ప్రతిపక్షాలుగా చెప్పుకునే పార్టీలన్నీ కుటుంబ పార్టీలే!

నిజాయతీని, సుపరిపాలనను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రతిపక్షాలుగా చెప్పుకునే పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. కుటుంబ పార్టీల్లో అధికారం వారసత్వంగా సంక్రమిస్తుంది. బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. మెజారిటీలు, మైనారిటీలు కాదు... అణగారిన వర్గాల అభివృద్ధే మా లక్ష్యం.

జీవితకాలంలో ఒక్కసారైనా కర్తార్ పూర్ సాహిబ్ చూడాలన్న సిక్కుల కల సాకారం చేసింది మేమే. పశ్చిమాసియా దేశాలతో మన సంబంధాలు మునుపటి కంటే బలోపేతం అయ్యాయి. పశ్చిమాసియా దేశాలు ఇప్పుడు మనకు సన్నిహిత మిత్ర దేశాలుగా ఉన్నాయి. పాకిస్థాన్ ను పక్కనబెట్టి పశ్చిమాసియాతో కొత్త సంబంధాలు నెలకొల్పాం.

గతంలో చమురు దిగుమతి, కార్మికుల ఎగుమతికే పరిమితం అయ్యాం. పశ్చిమాసియా దేశాలు ఇప్పుడు భారత్ ను నిత్యం ఆహ్వానిస్తున్నాయి. పశ్చిమాసియా దేశాలకు టెక్నాలజీ, ఆహారం, ఆధునిక సేవల ఎగుమతులు మనవే. 

ఎన్డీయే హ్యాట్రిక్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు

ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి విజయం సాధించడం తథ్యం. మన విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే గెలుపుపై ఎవరికీ అనుమానం అక్కర్లేదు. రాజకీయ పండితులెవరికీ ఎన్డీయే విజయానికి కారణాలు దొరకవు. 

భిన్నత్వంలో ఏకత్వం అనేది మన మూలసూత్రం... ఆ దిశగానే పని చేస్తున్నాం. ఏక్ భారత్... శ్రేష్ఠ్ భారత్ అన్నదే మన నినాదం కావాలి. దేశాభివృద్ధి విషయంలో తూర్పు, పశ్చిమం, ఉత్తర, దక్షిణం అనే బేధం లేదు. సంపూర్ణ భారతం, సమృద్ధ భారతం అన్నదే మన లక్ష్యం. 

ఈ పదేళ్లలో దేశం రూపురేఖలే మారిపోయాయి

గత పదేళ్లలో దేశ ముఖచిత్రమే మారిపోయింది. పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. భారతదేశ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తోంది. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పోషణ్ అభియాన్ కింద గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నాం. 10 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. పదేళ్లలో 25 కోట్ల గృహాలకు మరుగుదొడ్లు నిర్మించాం. మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని నిర్ణయించాం. మహిళల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు తీసుకువచ్చాం.

త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది

ఈ దేశ కలలు బీజేపీ, ఎన్డీయే కూటమి ప్రభుత్వంతోనే సాకారం అవుతాయి. భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఆ మేరకు నేను హామీ ఇస్తున్నా. జీఎస్టీ వసూళ్లు రూ.11 లక్షల కోట్లకు పెరిగాయి. జీఎస్టీ ఆదాయంతో ఇంటింటికీ నీరు, గ్రామాలకు రోడ్లు వేశాం. పన్ను వసూళ్లు పెరిగేకొద్దీ జీవన ప్రమాణాల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. 

మౌలిక వసతులు మెరుగుపడితేనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్వామ్యం పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థలో చలనశీలత వేగవంతం అవుతుంది. ప్రజల ఆదాయం పెరిగినప్పుడే దారిద్ర్య విష వలయాన్ని ఛేదిస్తాం. శుద్ధ ఇంధన తయారీ రంగంలో యువతకు కోట్లాది ఉద్యోగాలు లభిస్తాయి. 

గ్రీన్ ఎనర్జీ, సోలార్ విద్యుత్ దేశానికి కొత్త ఆదాయ వనరుగా మారాయి. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి దేశానికి అదనపు వనరులు చేకూర్చనుంది. ఓడరేవులు, పారిశ్రామిక పార్కుల అనుసంధానంతో ఎగుమతులు పెరుగుతాయి. సౌరశక్తి, శుద్ధ ఇంధనం దేశ దిగుమతుల భారాన్ని తగ్గించనున్నాయి. 


  • Loading...

More Telugu News