Lions: సఫారీ పార్కులో ఒకే ఎన్ క్లోజర్ లో అక్బర్, సీత అనే సింహాలు... కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ
- ఇటీవల బెంగాల్ లో సఫారీ పార్కుకు రెండు కొత్త సింహాల రాక
- మగ సింహం పేరు అక్బర్... ఆడ సింహం పేరు సీత
- రెండింటిని ఒకే ఎన్ క్లోజర్ లోకి వదలడం పట్ల వీహెచ్ పీ అభ్యంతరం
- హైకోర్టు బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో ఉన్న సఫారీ పార్కులో అక్బర్, సీత అనే సింహాలను ఒకే ఎన్ క్లోజర్ లోకి వదలడం విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ)ను ఆగ్రహానికి గురిచేసింది. అక్బర్ మగ సింహం కాగా, సీత ఆడసింహం. ఈ రెండు సింహాలను అటవీశాఖ అధికారులు ఇటీవలే త్రిపుర నుంచి సఫారీ పార్కుకు తీసుకువచ్చారు.
అయితే, అటవీ అధికారుల చర్యను నిరసించిన వీహెచ్ పీ పశ్చిమ బెంగాల్ విభాగం... జల్పాయ్ గురిలోని కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేసింది. 'అక్బర్' తో 'సీత'ను ఉంచడం హిందూ మతాన్ని కించపరిచే చర్య అని, పశ్చిమ బెంగాల్ అటవీ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
కాగా, అటవీ శాఖ అధికారులు దీనిపై స్పందిస్తూ... తాము ఆ రెండు సింహాలను త్రిపురలోని సెపాహీ జాలా జూ నుంచి తీసుకువచ్చామని, వాటికి అక్బర్, సీత అనే పేర్లను తాము పెట్టలేదని స్పష్టం చేశారు. త్రిపురలోని జూ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని వివరించారు.