India vs England: రాజ్‌కోట్ టెస్టులో ఘోర ఓటమి తర్వాత కొత్త డిమాండును తెరపైకి తీసుకొచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్
- డీఆర్ఎస్ వ్యవస్థలో ‘అంపైర్ నిర్ణయం’ విధానాన్ని తప్పుబట్టిన బెన్ స్టోక్స్
- బుమ్రా బౌలింగ్‌లో బంతి వికెట్ల దిశగా వెళ్లకపోయినా క్రాలేని ఔట్ ఇచ్చారని విమర్శలు
- రాజ్‌కోట్ టెస్టులో ఓటమి కారణాల్లో ఇదొకటని ప్రస్తావన
- అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు ముగ్గురు ఔటయ్యారని బెన్ స్టోక్స్ ఆవేదన
రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌లో ఘోర ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు. దారుణ ఓటమి గురించి మాట్లాడుతూ ఎంపైర్ల ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలపై సందేహాలు వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్ వ్యవస్థలో ‘అంపైర్ నిర్ణయం’ తమ ఓటమికి గల కారణాల్లో ఒకటిగా ఉందని, ఈ విధానాన్ని తొలగించాలంటూ చాలా కాలంగా చర్చ జరుగుతోందని ప్రస్తావించారు. ‘అంపైర్ల నిర్ణయం’ నిబంధనను తొలగించాలని పలువురు క్రికెట్ నిపుణులు ఇప్పటికే ఐసీసీఐని అభ్యర్థించారని బెన్‌స్టోక్స్ ప్రస్తావించాడు. ఈ సందర్భంగా రాజ్‌కోట్ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జాక్ క్రాలే ఎల్బీడబ్ల్యూగా ఔట్ అవడాన్ని స్టోక్స్ ఉదాహరణంగా ప్రస్తావించాడు.
జాక్ క్రాలే ఔట్ విషయంలో డీఆర్ఎస్ విధానంపై స్పష్టత కోరుతున్నామని, రీప్లేలో బంతి స్టంప్ దిశగా వెళ్లలేదని స్పష్టంగా కనిపించిందని, కానీ అంపైర్ నిర్ణయం కారణంగా క్రాలే ఔటయ్యాడని స్టోక్స్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయం విషయంలో తామంతా కలవరానికి గురయ్యామని, అందుకే ఈ ఔట్ విషయంలో మరింత స్పష్టత కోరుకుంటున్నామని చెప్పాడు. ఈ లోపాన్ని డీఆర్ఎస్ టెక్నాలజీని అందించిన టెక్నికల్ టీమ్‌తో కూడా మాట్లాడామని వివరించారు. ఈ మేరకు ‘టాక్‌స్పోర్ట్’తో మాట్లాడుతూ స్టోక్స్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
డీఆర్ఎస్ వ్యవస్థలో కొన్ని మార్పులు అవసరమని, అందులో మొదటిది 'అంపైర్ నిర్ణయం' అని స్టోక్స్ అన్నాడు. రాజ్‌కోట్ మ్యాచ్‌లో అంపైర్లు మూడు ఔట్లు తప్పుగా ఇచ్చారని, దురదృష్టవశాత్తు తాము తప్పుడు నిర్ణయాల వైపు ఉన్నామని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓటమికి ఇదొక్కటే కారణమని తాను చెప్పబోనని, 500లకుపైగా లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదని స్టోక్స్ పేర్కొన్నాడు.