Arvind Kejriwal: ఆ రెండు పనులు చేస్తే.. బీజేపీని సగం మంది వీడుతారు: కేజ్రీవాల్
- చౌహాన్, వసుంధర రాజే సొంత పార్టీలు పెట్టుకుంటారన్న ఢిల్లీ సీఎం
- ఈడీ దాడులకు భయపడే ఆ పార్టీలో చేరుతున్నారని వ్యాఖ్య
- పీఎంఎల్ఏ సెక్షన్ 45ను రద్దు చేస్తే బీజేపీ ఖాళీ అవుతుందని వెల్లడి
బీజేపీ నేతల్లో చాలామంది ఈడీ దాడులకు భయపడే ఆ పార్టీలో ఉంటున్నారని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఒకవేళ ఈడీని, పీఎంఎల్ఏ సెక్షన్ 45ను రద్దు చేస్తే.. బీజేపీ నుంచి సగం మంది నేతలు బయటకు వచ్చేస్తారని చెప్పారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే బీజేపీని వదిలేసి సొంతంగా పార్టీ పెట్టుకుంటారని జోస్యం చెప్పారు. ఈమేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం సందర్భంగా అర్వింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం కాంగ్రెస్ నేత, లాయర్ అభిషేక్ మను సింఘ్వి నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్ కు కేజ్రీవాల్ హాజరయ్యారు. ఆప్ మినిస్టర్ అతిషీ కూడా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే, కేజ్రీవాల్, సింఘ్వి, అతిషీ పాల్గొన్నారు. అంతకుముందు ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కు కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. బీజేపీ కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.