Dsc 2008: పదిహేనేళ్లుగా ఎదురుచూస్తున్నాం.. ఇప్పుడైనా న్యాయం చేయరూ..!: సీఎం రేవంత్ రెడ్డికి డీఎస్సీ 2008 అభ్యర్థుల విజ్ఞప్తి
- జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి భారీగా చేరుకున్న అభ్యర్థులు
- సీఎం అందుబాటులో లేకపోవడంతో పీఎస్ ను కలిసి వినతిపత్రం అందజేత
- అప్పటి ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపణ
కామన్ మెరిట్ లో ఎంపికైనా తమకు ఉద్యోగాలు దక్కలేదని, ఉద్యోగం కోసం పదిహేనేళ్లుగా పోరాడుతున్నామని డీఎస్సీ 2008 అభ్యర్థులు వాపోయారు. కోర్టు తీర్పు ఇచ్చినా సరే గత ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని, పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈమేరకు సోమవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయాలని డీఎస్సీ 2008 అభ్యర్థులు హైదరాబాద్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్దకు భారీగా చేరుకుని, ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన పర్సనల్ సెక్రటరీని కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం పలువురు అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం కామన్ మెరిట్ లో తాము అర్హత సాధించామని చెప్పారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై పదిహేనేళ్లుగా పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందని, ఆరు వారాల్లో తమకు ఉద్యోగాలు ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తమపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.