Ganta Srinivasa Rao: రాబోయే రోజుల్లో టీడీపీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు మాకు ఉన్నాడని లోకేశ్ నిరూపించారు: గంటా
- విశాఖ నియోజకవర్గంలో నారా లోకేశ్ శంఖారావం సభ
- దేశంలో ఏ పార్టీకి లేని సంక్షేమ నిధిని లోకేశ్ టీడీపీ కోసం ప్రవేశపెట్టారన్న గంటా
- లోకేశ్ టీడీపీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని కితాబు
విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఇవాళ నారా లోకేశ్ నిర్వహించిన శంఖారావం సభలో టీడీపీ ఇన్చార్జి గంటా శ్రీనివాసరావు ప్రసంగించారు. నాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు అందరూ అవహేళన చేశారని, కానీ ఆ తర్వాత ఆయన ప్రపంచానికి తమ సత్తా ఏంటో చాటారని వెల్లడించారు. భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమనిధిని లోకేశ్ టీడీపీ కేడర్ కోసం ప్రవేశపెట్టారని వివరించారు. లోకేశ్ పార్టీని కొత్తపుంతలు తొక్కిస్తున్నారని, రాబోయే రోజుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించే నాయకుడు మాకు ఉన్నాడని నిరూపించారని కొనియాడారు.
ఎన్నికల్లో చివరి బంతి కూడా కీలకమే!
ఎన్నికల మ్యాచ్ లో చివరి 3 ఓవర్లు మాత్రమే కాదు... లాస్ట్ బాల్ కూడా ఎంతో కీలకమైనది.2019 ఎన్నికల్లో ఒక్కచాన్స్ అని జగన్ అడగడంతో జనం మోసపోయారు. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలుంటే అసెంబ్లీలో కోరంలేక వాయిదా వేసే పరిస్థితి నెలకొంది. జగన్ ఢిల్లీ వెళితే ఆయన వెంట ఉన్నది కేవలం ముగ్గురే ఎంపీలే. ప్రజలే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీల నమ్మకాన్ని కూడా జగన్ కోల్పోయారు.
త్వరలోనే జగన్ కు బై బై
త్వరలో జగన్ కు బై బై చెప్పాల్సిన చారిత్రాత్మక అవసరం రాష్ట్రానికి ఉంది. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభించారు. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. 900కి పైగా హామీలు ఇచ్చి, 15 శాతం కూడా నెరవేర్చలేదు, మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతామని చెప్పిన జగన్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు?
చంద్రబాబు ఇక్కడే ఉండి పరిపాలన ఏంటో చూపించారు
విశాఖ ఒకప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీ గా ఉండేది. హుద్ హుద్ సమయంలో చంద్రబాబు ఇక్కడే ఉండి పరిపాలన అంటే ఎలా ఉండాలో చూపించారు. నేడు జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖ నగరాన్ని క్రైమ్ క్యాపిటల్ గా మార్చేశారు. మధురవాడలో ఓ అపార్ట్ మెంట్ లో ఎమ్మార్వో రమణయ్యను దారుణంగా చంపేశారు. ఇటువంటి అరాచకపాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం–జనసేన పార్టీలది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్, వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయడానికి కలసివచ్చిన పవన్ కల్యాణ్ కు అభినందనలు.