Ali: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేసిన అలీ
- వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్న అలీ
- గుంటూరు, నంద్యాలలో అలీ పోటీ చేయొచ్చని ప్రచారం
- తాను ఎక్కడ పోటీ చేయాలో వైసీపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని వెల్లడి
- పార్టీకి సేవ చేయడానికే తన ప్రాధాన్యత అని స్పష్టీకరణ
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ వైసీపీ నాయకుడన్న సంగతి తెలిసిందే. ఆయన గత ఎన్నికల్లోనే పోటీ చేస్తారని భావించినా, అలా జరగలేదు. ఈసారి ఆయన పరిస్థితి ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోపక్క, గుంటూరు, నంద్యాలలో అలీ పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కేవలం ప్రచారం మాత్రమేనని, అధిష్ఠానం ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు.
తాను ఎక్కడ్నించి పోటీ చేస్తానన్నది నిర్ణయించాల్సింది వైసీపీ హైకమాండ్ అని, పార్టీ పెద్దలు ప్రకటిస్తే ఆ విషయాన్ని తానే స్వయంగా మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. సీఎంవో నుంచి ఇంకా కాల్ రాలేదని అన్నారు.
సొంతూరు రాజమండ్రి నుంచి బరిలో దిగే చాన్సులు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలపైనా అలీ స్పందించారు. ప్రతి ఎన్నికలప్పుడూ ఇలాగే అంటున్నారని నవ్వేశారు. ఏదైనా ఉంటే తానే చెబుతానని అన్నారు.
గత ఎన్నికల సమయంలో అడిగారని, కానీ పోటీ చేసేందుకు సమయం తక్కువగా ఉండడంతో, పార్టీకి సేవ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. ఇటీవల 12 చోట్ల బస్సు యాత్రలో పాల్గొన్నానని వెల్లడించారు. ఈ వారంలో సీఎం కార్యాలయం నుంచి కబురు వస్తుందని భావిస్తున్నానని, సీఎంను కలుస్తానని తెలిపారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభకు ప్రజలనుంచి భారీ స్పందన లభించిందని, సీఎం జగన్ చేస్తున్న మంచి పనులను ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గాలన్నది ప్రజలు నిర్ణయిస్తారని, తాను వైసీపీలో ఉన్నాను కాబట్టి వైసీపీనే నెగ్గాలని కోరుకుంటానని చెప్పారు.
మీరు రాజ్యసభ రేసులో ఉన్నారు... ఈసారి కూడా ఆ పదవి రాలేదు... దీనిపై మీరేమంటారు? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.... పదవుల కోసం తాను పార్టీలోకి రాలేదని అలీ స్పష్టం చేశారు.