Medaram Jatara: మేడారం వచ్చే వీఐపీలు తమ వాహనాలను ములుగులో వుంచి, బస్సుల్లో రావాలి: మంత్రి సీతక్క
- భక్తులకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఫిర్యాదు చేయాలని సూచన
- మేడారం జాతరకు అధిక సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
- జాతర పర్యవేక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించామన్న మంత్రి
మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు 17 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్‌తో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వీఐపీలు తమ వాహనాలను ములుగులో ఉంచి బస్సుల్లో మేడారం జాతరకు రావాలని సూచించారు. భక్తులకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. సోమవారం ఆమె మేడారం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మేడారం జాతరకు అధిక సంఖ్యంలో బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కువమంది పారిశుద్ధ్య కార్మికులను మేడారంలో ఉంచినట్లు తెలిపారు. జాతర పర్యవేక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించామన్నారు. ఈ 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగుతుందన్నారు. పండుగ జరిగే ఈ నాలుగు రోజుల్లో 2 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జాతరకు ఇంత పెద్దమొత్తంలో భక్తులు రావడం ఇదే తొలిసారి అవుతుందన్నారు. జాతర వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారు. రెండు నెలల నుంచి అధికారులు ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. జాతర విజయవంతం కావడానికి సహకరిస్తున్న వారందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.