Sajjala Ramakrishna Reddy: అధికారంలోకి రారని తెలిసి ఎన్ని చాలెంజ్ లు అయినా చేస్తారు: చంద్రబాబుపై సజ్జల విమర్శలు
- సీఎం జగన్ కు చంద్రబాబు ఓపెన్ చాలెంజ్
- 2014-19 మధ్య ఏం చేశారో చెప్పగలరా? అంటూ ప్రశ్నించిన సజ్జల
- చంద్రబాబుకు జగన్ ను సవాల్ చేసే అర్హత లేదని స్పష్టీకరణ
- కారుకూతలను తాము పట్టించుకోబోమని వ్యాఖ్య
ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసరడంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తన ఐదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని వ్యక్తికి, ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ను సవాల్ చేసే అర్హత లేదు, హక్కు లేదని అన్నారు. గెలిచేది లేదని తెలిసి ఎన్ని చాలెంజ్ లు అయినా చేస్తారని ఎద్దేవా చేశారు.
"వైసీపీ మాట్లాడినా, జగన్ మాట్లాడినా... ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా... మేం ప్రజలతోనే మాట్లాడతాం. చంద్రబాబు హయాంలో అవినీతి పాలన, అరాచక పాలన, అవకతవకలపై మేం ప్రజలకు వివరిస్తుంటాం... దాంతో పోల్చితే మా పాలన ఎలా ఉందో చెబుతుంటాం.
నీకు సత్తా ఉంటే 2014-19 మధ్య ఏం చేశావో చెప్పాలి. ఒక్క మాటైనా నిజం ఉందా... ఆయన గానీ, ఆయన కొడుకు గానీ, ఆయన అరువు తెచ్చుకున్న దత్తపుత్రుడు గానీ ఒక్క మాటైనా నిజం మాట్లాడతారా? ఇది చెత్త పాలన... నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ 2018లో దత్తపుత్రుడు పక్కకు వెళ్లిపోయాడు.
ఈ తండ్రీకొడుకులైనా 2014-19 మధ్య మేం ఇది చేశాం... జగన్ మోహన్ రెడ్డి పాలన కంటే మేం ఇందులో బాగా చేశాం... మాకు ఓట్లేయండి అని ఒక్కరోజైనా అడుగుతున్నారా? నోరు తెరిస్తే తిట్లు, బూతులు తప్ప ఇంకేమీ మాట్లాడరు. జగన్ ప్రజాస్వామ్యంపై అత్యంత నమ్మకం ఉన్న వ్యక్తి కాబట్టి, ప్రజలే అంతిమనిర్ణేతలు అని తెలిసిన వ్యక్తి కాబట్టి... ఈ కారుకూతలను పట్టించుకోలేదు.
వాళ్లు అంటున్నట్టు జగన్ ఒక నియంత అయితేనో, జగన్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తుంటేనో చంద్రబాబు, ఆయన కొడుకు, వాళ్ల ముఠా బరి తెగించి రోడ్లెక్కే వాళ్లా? తిట్లు తప్ప వాళ్లు వేరే అంశాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సహేతుకంగా, ఆధారాలతో ఒక్క ఆరోపణ అయినా చేస్తున్నారా అంటే అదీ లేదు.
ఇవాళ కూడా జగన్ ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ ఒక్కచోట చేర్చి పోస్టు పెట్టారు. అందులో జగన్ మాట్లాడినవేవీ మేం కాదనడంలేదు... కానీ తుది మేనిఫెస్టోలో ఏం చెప్పారన్నదే ముఖ్యం. అందులో మేం ఏమేం అమలు చేశామో రోజూ చెప్పుకుంటూనే ఉన్నాం.
మద్య నిషేధం గురించి కూడా దశలవారీగానే అని అన్నాం. ఆ లక్ష్యం ఒక డ్రీమ్ వంటిది. ఆచరణలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాల్యూమ్స్ అవీ తగ్గడంతో ఆదాయం పడిపోకుండా చూసుకున్నాం... ఎందుకంటే సంక్షేమానికి నిధులు కావాలి. అయితే బెల్ట్ షాపులనేవే లేకుండా చేశాం. మద్యం షాపులు కూడా సగానికి సగం తగ్గిపోయాయి. ప్రభుత్వమే తీసుకోవడం వల్ల ఆదాయానికి గండిపడకుండా చూసుకుంటున్నాం.
ఒకప్పుడు మద్యం ఆదాయం రూ.16 వేల కోట్లు ఉండేది, ఇప్పుడది రూ.25 వేల కోట్లకు పెరిగింది. అదే సమయంలో మద్యపానం తగ్గింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వస్తోంది. అదెలా సాధ్యమైందంటే... ఇంతకుముందు సిండికేట్ రూపంలో దోచుకునేవాళ్లని అర్థమవుతోంది. మద్యపాన నిషేధం అంశాన్నే ఎందుకింత వివరంగా చెబుతున్నాం అంటే... దీన్నొక్క దాన్నే అనుకున్న విధంగా చేయలేకపోయాం.
మేనిఫెస్టోలో 99 శాతం పూర్తి చేశామని సగర్వంగా చెప్పుకుంటున్నాం... ఏవి మేం చేయలేకపోయామో చెప్పమనండి. అవేవీ చెప్పలేకపోగా... ఇవాళ చర్చకు రండి అంటున్నారు. చర్చకు రావడానికి సిద్ధమే... అది ఎప్పుడంటే... ముందు ఓ పద్ధతి ప్రకారం ప్రజలకు చెప్పు. 2014-19 మధ్య నేను ఇవి చేశాను... వీటిని జగన్ తీసేశారు అని చెప్పు. లేకపోతే, ఈయన చేసినవి బాగాలేవు... వీటిని తీసేసి వీటికంటే మెరుగైనవి పెడతాను అని చెప్పు.
వీటన్నింటినీ వదిలేసి... నీకు నువ్వే నీ ఈనాడు, నీ ఆంధ్రజ్యోతిలో రోజుకు నాలుగైదు హెడ్డింగులు పెట్టేసి అరాచక పాలన అంటే ఎలా? ఎక్కడో జరిగే వాటికి కూడా రాజకీయ రంగు పులిమేసి, ఇవన్నీ నిజాలు అంటూ గోబెల్స్ ప్రచారం చేసి, వీటిపై చర్చకు రా అంటే ఎలా కుదురుతుంది? నువ్వు అధికారంలోకి రాబోతున్నావని రాత్రిపూట కలలు కనేసి వాటిపై చర్చకు రమ్మంటే ఎందుకు రావాలి?
ఈ మాత్రం దానికి జగనే రావాలా... ఎవరైనా వస్తారు. అది కూడా మీరు మాట్లాడేది అసంబద్ధంగా లేకపోతేనే. మీరు మాట్లాడేది హేతుబద్ధంగా ఉంటేనే చర్చ సాధ్యమవుతుంది. మీరు చెప్పేది నిజమైతే ప్రజలే మిమ్మల్ని అభిమానిస్తారు, లేకపోతే ఛీత్కరిస్తారు. అది కూడా దగ్గర్లోనే ఉంది... ఇంకెంత, 50 రోజులే కదా... రెండు మూడేళ్లు కాదు కదా! ఈ మాత్రం దానికి పొద్దుపోని చాలెంజ్ లు ఎందుకు?
మేం ఏం చేశామో ప్రజలకు చెబుతున్నాం. చంద్రబాబు ఎందుకు సభలు పెడుతున్నాడో తెలియదు. నీ అమరావతి రాజధాని రోడ్లు ఒక దగ్గర మొదలై, ఇంకో దగ్గర ముగుస్తాయి... నువ్వు కూడా అంతే. ఇప్పటికే కదలి రా, శంఖారావాలు అంటూ 20, 30 పేర్లు పెట్టుకుని బయల్దేరాడు. నాలుగు రోజులు ఈయన తిరుగుతాడు, నాలుగు రోజులు కొడుకు తిరుగుతాడు, ఇంకో రెండ్రోజులు దత్తపుత్రుడు తిరగబోయి మానేస్తాడు.
ఏ సభలు ఎందుకో తెలియదు. అక్కడికి వెళ్లి చాలెంజ్ లు విసరడం, మీ వీపులు మీరు చరుచుకోవడం, పగటికలలు కనడం... ఇదేగా మీకు తెలిసింది! మాట్లాడితే కౌంట్ డౌన్ అంటారు. అంత అవసరమా...? పాజిటివ్ గా మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలే నిర్ణయిస్తారు" అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.