CPI Narayana: ఛత్రపతి శివాజీ రైతు నేస్తంగా పాలన చేస్తే.. మోదీ రైతు శత్రువుగా మారారు: సీపీఐ నారాయణ
- 400 సంవత్సరాల క్రితం రైతు సంక్షేమం, ప్రయోజనాల కోసం సంస్కరణలు తెచ్చారన్న నారాయణ
- తన రాజ్యంలోని రైతులను నేరుగా పిలిపించి ఇబ్బందులను శివాజీ తెలుసుకునే వారన్న సీపీఐ నేత
- ప్రధాని మోదీ మాత్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆగ్రహం
ఛత్రపతి శివాజీ మహారాజ్ రైతు నేస్తంగా పాలన కొనసాగించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కానీ ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ రైతు శత్రువుగా మారి దుర్మార్గపు పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఛత్రపతి శివాజీ 394వ జయంతి సందర్భంగా మగ్ధుం భవన్‌లో సోమవారం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, 400 సంవత్సరాల క్రితం రైతుల సంక్షేమం, వారి ప్రయోజనాల కోసం ఛత్రపతి శివాజీ అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని కొనియాడారు.
తన రాజ్యంలోని రైతులను నేరుగా పిలిపించి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునే వారన్నారు. భూస్వామ్య వ్యవస్థను తొలగించి నూతన రెవెన్యూ వ్యవస్థను నెలకొల్పారన్నారు. రైతులు పండించిన పంట దిగుబడి ఆధారంగా ఆ పంట యొక్క విస్తీర్ణాన్ని కొలిచి, ఆ తర్వాత మాత్రమే పన్నులు వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవారన్నారు.
కానీ ఇప్పుడు ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తానని పార్లమెంటులో ప్రగల్బాలు పలికిన ప్రధాని ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదన్నారు. అందుకే రైతులు తమ హక్కులను సాధించుకోవడానికి ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. కానీ రాజధానికి బయలుదేరిన రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలీసు సైన్యం పహారాల మధ్య ఢిల్లీ బోర్డర్లను ప్రభుత్వం దిగ్బంధించడం సిగ్గుచేటు అన్నారు.
ప్రభుత్వ చర్యలను ప్రతిఘటిస్తూ ముందుకు వస్తోన్న రైతులపై రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. డ్రోన్ల సహాయంలో పిల్లేట్లను వదులుతూ.. లాఠీచార్జ్ చేస్తూ రైతులను గాయపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై, ప్రజాస్వామికవాదులపై ఉందన్నారు.