Nara Lokesh: వాలంటీర్లు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు: నారా లోకేశ్
- అనకాపల్లిలో టీడీపీ శంఖారావం సభ
- టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని ప్రచారం చేస్తున్నారన్న లోకేశ్
- సంక్షేమ పథకాలను ప్రారంభించిందే టీడీపీ అని స్పష్టీకరణ
అనకాపల్లిలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో నారా లోకేశ్ ప్రసంగించారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారని చెబుతున్నారని ఆరోపించారు. దేశంలో సంక్షేమ పథకాలను ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అని, తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల ద్వారా అన్ని వర్గాలకు మేలు చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో రోడ్లకు మరమ్మతులే లేవని విమర్శించారు. యువగళం పాదయాత్రలో పలు చోట్ల సెల్ఫీ చాలెంజ్ లు చేశానని, వైసీపీ నుంచి స్పందనే లేదని అన్నారు. జగన్ రెడ్డి వంటి వ్యక్తికి మరో చాన్స్ ఇస్తే అన్నీ దోచేస్తారని స్పష్టం చేశారు. జగన్ చెప్పిన నవరత్నాలన్నీ నవమోసాలుగా మారాయని ఎద్దేవా చేశారు. మరో రెండు నెలల్లో ప్రజలు మీ కుర్చీనే మడతపెడతారు అంటూ లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో తట్ట మట్టి అయినా తీశారా? అని ప్రశ్నించారు. మద్య నిషేధం పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు పెండింగ్ లో పెట్టారని మండిపడ్డారు. పేదలకు 30 లక్షల ఇళ్లు అన్నారు... 3 వేల ఇళ్లయినా కట్టారా? అని లోకేశ్ నిలదీశారు. హాల్ టికెట్లు, మార్క్ లిస్టుల పేరిట కూడా డబ్బులు దోచేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలేదని అన్నారు. సొంత తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి ప్రజలను ఆదరిస్తారా? అని వ్యాఖ్యానించారు.
తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు!
విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖలో రైల్వే జోన్, మెట్రో రైలు అన్నారు... తెచ్చారా? విశాఖకు ఐదేళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. అనకాపల్లికి టీడీపీ హయాంలో రూ.1000 కోట్లు కేటాయించాం. టిడ్కో ఇళ్లు అందించాం. మేం ఇన్ని చేసినా పాలు ఇచ్చే ఆవును కాదని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. అనకాపల్లిలో ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? మంత్రి అమర్నాథ్ అనకాపల్లిలో భూ దందాలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో గంజాయి సరఫరా చేసే ఎవరినీ వదిలిపెట్టం. అనకాపల్లి జిల్లాలోని నల్ల బెల్లం రైతులను ఆదుకుంటాం. అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు రోడ్లు వేసే బాధ్యత నాది.