Dastagiri: దాడి కేసులో దస్తగిరికి బెయిల్
- వివేకా హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి
- గత నవంబరులో దస్తగిరిపై దాడి కేసు
- నేడు బెయిల్ మంజూరు చేసిన కడప జిల్లా న్యాయస్థానం
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న మాజీ డ్రైవర్ దస్తగిరి అట్రాసిటీ, దాడి కేసుల్లో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 2023 నవంబరులో నమోదైన దాడి కేసులో వేముల పోలీసులు దస్తగిరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు.
కాగా, దస్తగిరికి నేడు కడప డిస్ట్రిక్ట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన నేపథ్యంలో, అతను రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు, ఎర్రగుంట్ల పోలీసులు నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో దస్తగిరికి ఇటీవలే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దస్తగిరి బంధువుల అమ్మాయి ఇమాంబీ... లక్ష్మీనారాయణ అనే యువకుడ్ని ప్రేమించింది. ఇమాంబీ వయసు 18 ఏళ్లు కాగా, లక్ష్మీనారాయణ వయసు 21 ఏళ్లు. లక్ష్మీనారాయణతో కలిసి ఇమాంబీ వెళ్లిపోగా... ఇమాంబీ మైనర్ అంటూ పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. అయినప్పటికీ ఇమాంబీ తన ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో, ఇమాంబీ తల్లిదండ్రులు, దస్తగిరి, ఇంకొందరు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి, అక్కడ్నించి ఇమాంబీని బలవంతంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగానే లక్ష్మీనారాయణను దస్తగిరి కులం పేరుతో దూషించాడంటూ కేసు నమోదైంది. అంతేకాదు, ఈ ఘటనకు సంబంధించి దాడి కేసు కూడా నమోదైంది.