Kodali Nani: కొడాలి నానికి కాకుండా.. తనకు గుడివాడ టికెట్ ఇస్తున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన హనుమంతరావు

Mandava Hanumantha Rao gives clarity on Gudivada MLA ticket

  • ఈ వార్తల్లో నిజం లేదన్న హనుమంతరావు
  • కొడాలి నానికి వ్యతిరేకంగా తాను రాజకీయాలు చేయనని స్పష్టీకరణ
  • కొడాలి నానితో కలిసి నిన్న గుడ్లవల్లేరులో పర్యటించిన హనుమంతరావు

ఇప్పటికే వైసీపీలో పలువురు సిట్టింగులకు టికెట్ల నిరాకరణ, చాలా మందికి స్థాన చలనం వంటి అంశాలు టెన్షన్ ను పెంచుతున్నాయి. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఈ సారి టికెట్ ఇవ్వడం లేదని, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండవ హనుమంతరావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటూ గుడివాడలో బ్యానర్లు వెలిశాయి. ఎన్నికల్లో పోటీ చేయబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. వాట్సాప్ లో కూడా ఈ అంశం విపరీతంగా షేర్ అయింది. దీంతో, గుడివాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. 

అయితే, ఈ అంశంపై హనుమంతరావు క్లారిటీ ఇచ్చారు. గుడివాడ ఎమ్మెల్యే పోటీలో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. తన విషయంలో జరుగుతున్నదంతా అసత్య ప్రచారమేనని చెప్పారు. కొడాలి నానికి కాకుండా తనకు టికెట్ ఇస్తున్నారని, ఇది దాదాపు ఖరారయిపోయిందని సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తమ ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కొడాలి నానికి వ్యతిరేకంగా తాను రాజకీయాలు చేయనని తెలిపారు. 

వృత్తిరీత్యా బిజీగా ఉండటం వల్ల తాను పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనలేకపోతున్నానని... అందుకే నానితో తనకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగి ఉంటుందని హనుమంతరావు అన్నారు. పార్టీ లైన్ ను కానీ, నానీని కానీ దాటి తాను వెళ్లనని చెప్పారు. పార్టీ ఇమేజ్ దెబ్బతినే పనులు తాను ఎప్పటికీ చేయబోనని అన్నారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో కొడాలి నానితో కలిసి హనుమంతరావు నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా నాని సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టి పైవిషయాలను హనుమంతరావు వెల్లడించారు.

  • Loading...

More Telugu News