Revanth Reddy: ఏపీలో కాంగ్రెస్ తొలి భారీ బహిరంగ సభ.. హాజరవుతున్న రేవంత్ రెడ్డి!
- అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీ కాంగ్రెస్
- ఈ నెల 25న తిరుపతిలో భారీ సభ
- ఏపీలో రేవంత్ విస్తృతంగా ప్రచారం చేసేలా హైకమాండ్ ప్లాన్
దక్షిణాదిన కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఆత్మవిశ్వాసం కొంత పెరిగినట్టయింది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ ను ప్రదర్శిస్తున్నారు. వేగవంతమైన నిర్ణయాలు, కార్యాచరణతో ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
మరోవైపు, ఏపీలో కూడా బలం పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను షర్మిల తీసుకున్న తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ వచ్చింది. షర్మిల కూడా అధికార వైసీపీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తూ, మధ్యలో టీడీపీని సున్నితంగా టార్గెట్ చేస్తూ ఏపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చారు.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. షర్మిల బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. ఈ నెల 25న జరగబోతున్న ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు హాజరవుతున్నారు. ఈ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏపీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసేలా పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాల గురించి ఏపీలో ఆ పార్టీ ప్రచారం చేయనుంది.