Kota Student: కోటాలో అదృశ్యమై చంబల్లోయలో విగతజీవిగా కనిపించిన జేఈఈ అభ్యర్థి
- రాజస్థాన్‌లోని కోటాలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
- పరీక్షపేరుతో హాస్టల్ నుంచి బయటకు వచ్చి అదృశ్యమైన రచిత్
- వారం రోజుల గాలింపు అనంతరం చంబల్లోయలో మృతదేహం గుర్తింపు
- అదృశ్యమైన మరో విద్యార్థి కోసం కొనసాగుతున్న గాలింపు
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి శవమై కనిపించాడు. ఐఐటీ జేఈఈకి శిక్షణ పొందుతూ ఈ నెల 11న అదృశ్యమైన విద్యార్థి మృతదేహాన్ని వారం రోజుల అనంతరం చంబల్ లోయలో గుర్తించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్ సోంధియా కోటాలో చదువుకుంటున్నాడు. పరీక్ష ఉందని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వచ్చిన రచిత్ చివరిసారి గరాడియా మహాదేవ్ ఆలయ సమీపంలోని అడవిలోకి వెళ్తూ అక్కడి సెక్యూరిటీ కెమెరాలకు చిక్కాడు. ఆ తర్వాత అతడి జాడ కనిపించలేదు. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌తో వారం రోజులపాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి చంబల్ లోయలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఓ కొండపై నుంచి దూకి చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రచిత్ మృతితో ఈ నెలలో కోటాలో మరణించిన విద్యార్థుల సంఖ్య నాలుగుకు పెరిగింది.
పీయూష్ కపాసియా అనే మరో విద్యార్థి కూడా కోటా నుంచి అదృశ్యమయ్యాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీయూష్ జేఈఈకి శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 13 నుంచి కనిపించకుండా పోయాడు. రెండేళ్లుగా కోటాలోని ఇంద్రవిహార్‌లోని హాస్టల్లో ఉంటున్న పీయూష్ అదృశ్యం కావడానికి ముందు కుటుంబంతో కమ్యూనికేషన్ కట్ చేశాడు. చివరిసారి గత మంగళవారం తల్లితో మాట్లాడాడు. ఆ తర్వాతి నుంచి ఫోన్‌కాల్స్‌కు స్పందించడం లేదని పీయూష్ తండ్రి తెలిపారు. ఆ తర్వాత ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీయూష్ కోసం గాలిస్తున్నారు.