ACB: లంచం తీసుకుంటూ పట్టుబడి.. కెమెరా ముందు ఉద్యోగి కంటతడి.. వీడియో ఇదిగో!
- తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవినీతి
- పక్కాగా ప్లాన్ చేసి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
- పట్టుబడ్డ తర్వాత కెమెరా ముందే కన్నీటిపర్యంతమైన జ్యోతి
పని పూర్తికావాలంటే పైసలు ముట్టజెప్పాల్సిందేనంటూ హూంకరించిన ఆ ఉద్యోగిని ఇప్పుడు కెమెరా ముందే కంటతడి పెట్టింది. కరాఖండీగా వసూలు చేసిన సొమ్మును లెక్కపెట్టిన చేతులతోనే ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతోంది. హైదరాబాద్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో రూ.84 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగ జ్యోతి.. కెమెరా ముందు కన్నీరు పెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పక్కాగా ప్లాన్ చేసి జ్యోతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆమెను అరెస్టు చేశారు. మంగళవారం ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జగ జ్యోతిపై ఓ వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. జగ జ్యోతి లంచం డిమాండ్ చేస్తోందని కంప్లైంట్ చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్లాన్ చేశారు. రసాయనాలలో ముంచిన నోట్లను బాధితుడికి అందించి, వాటిని లంచంగా జ్యోతికి ఇవ్వాలని సూచించారు. అధికారులు చెప్పినట్లుగానే బాధితుడు వాటిని తీసుకెళ్లి జగ జ్యోతికి అందించాడు.
అప్పటికే అక్కడ కాపుకాసిన అధికారులు.. జగ జ్యోతి ఆ నోట్లను తీసుకోగానే వెళ్లి పట్టుకున్నారు. సాక్ష్యం కోసం వీడియో రికార్డింగ్ చేస్తూ ఆమె చేతులను రసాయనంతో కడగగా.. నోట్లకు పూసిన కెమికల్ కారణంగా జ్యోతి చేతులు రంగు మారాయి. దీంతో ఆమె క్యాబిన్ ను తనిఖీ చేసిన అధికారులు.. తర్వాత జ్యోతి నివాసంలోనూ సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జ్యోతిని అరెస్టు చేసి జైలుకు తరలించి, మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేశారు.