Sharmila: ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపైనా, కర్నూలులో ఈనాడు పత్రికా కార్యాలయంపైనా వైసీపీ మూకల దాడి అమానుషం: వైఎస్ షర్మిల
- మొన్న రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడి
- నేడు కర్నూలులో ఈనాడు కార్యాలయం ముట్టడి
- ఇవి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులు అంటూ వైసీపీపై షర్మిల ఫైర్
రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టు శ్రీకృష్ణను విచక్షణరహితంగా కొట్టడం, ఇవాళ కర్నూలు ఈనాడు పత్రికా కార్యాలయం ముట్టడి ఘటనలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు.
ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీకృష్ణపై, కర్నూలులో ఈనాడు పత్రికా కార్యాలయంపై వైసీపీ మూకల దాడి అమానుషం అని పేర్కొన్నారు. ఇవి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులు అని ఆరోపించారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తోందనడానికి ఈ దాడులే నిదర్శనమని షర్మిల ధ్వజమెత్తారు.
నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు దిగడం, కొట్టి చంపడాలు అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఘాటుగా విమర్శించారు. జర్నలిస్టులపై, పత్రికా కార్యాలయాలపై దాడులకు పాల్పడడం వైసీపీ పాలనలో నిత్యకృత్యం అని మండిపడ్డారు.
"పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే. తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు శ్రీకృష్ణకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి కుటుంబాన్ని ఆదుకోవాలి" అని షర్మిల డిమాండ్ చేశారు.