Britain: భారతీయ నిపుణులకు 3 వేల వీసాలు ఆఫర్ చేస్తున్న బ్రిటన్
- భారతీయులకు ద్వారాలు తెరుస్తున్న బ్రిటన్
- బ్యాలట్ విధానం ద్వారా వీసాల జారీ
- ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు
భారతీయ నిపుణులకు బ్రిటన్ ద్వారాలు తెరుస్తోంది. రెండేళ్ల పాటు తమ దేశంలో ఉండడానికి, పనిచేయడానికి, చదువుకోవడానికి నూతన బ్యాలెట్ విధానం ప్రకారం 3 వేల వీసాలు జారీ చేయనుంది. ఈ మేరకు భారత్ లోని బ్రిటన్ హై కమిషన్ కార్యాలయం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ పేరిట ఓ ప్రకటన చేసింది.
18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న భారత పౌరులను ఆకర్షించే ఉద్దేశంతో ఈ వీసా స్కీమ్ తీసుకువచ్చారు. వీసాల జారీకి చేపట్టే బ్యాలట్ విధానంలో ప్రవేశించేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. అయితే, వీసా జారీ అయ్యాక రూ.31 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
భారత యువ నిపుణుల కోసం 3 వేల స్థానాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో చాలావరకు ఫిబ్రవరి బ్యాలట్ కోటాలో అందుబాటులోకి తెస్తామని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. మిగతా వీసాలు జులై బ్యాలట్ లో అందుబాటులోకి ఉంటాయని పేర్కొంది.
బ్యాలట్ విండో ఫిబ్రవరి 20న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22 వరకు వీసా దరఖాస్తులకు అవకాశం ఉంటుంది.