Virat Kohli: విరాట్ కోహ్లీ కొడుకు పేరు ‘అకాయ్’ అంటే అర్థం ఏమిటి?
- హిందీ పదం ‘కాయ’ నుంచి వచ్చిందంటున్న నెటిజన్లు
- కాయం అంటే శరీరం .. అకాయ్ అంటే ‘శరీరాన్ని మించినవాడు’ అని అర్థాలు చెబుతున్న వైనం
- ఇక టర్కిష్ భాషలో అకాయ్ అంటే ‘ప్రకాశవంతమైన వెన్నెల’ అని పేర్కొంటున్న విరాట్-అనుష్క ఫ్యాన్స్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు రెండవ సంతానానికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డ పుట్టాడంటూ ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘ ఫిబ్రవరి 15న మేము మా బేబీ బాయ్ ‘అకాయ్’.. వామికా చిట్టి సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించామని అంతులేని ఆనందం, ప్రేమతో నిండిన హృదయంతో ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. మా జీవితాల్లోనే అందమైన ఈ క్షణంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను ఆశిస్తున్నాం. మా గోప్యతను గౌరవించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’’ అని విరాట్-అనుష్క జంట సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా కాస్త కొత్తగా అనిపిస్తుండడంతో విరాట్ కొడుకు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏమిటనేది చర్చ మొదలైంది. కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి అర్థంపై సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. హిందీ పదం 'కాయ' నుంచి ఈ పేరు వచ్చిందని, కాయ అంటే 'శరీరం' అని అంటున్నారు. ఇక అకాయ్ అంటే ‘భౌతిక శరీరాన్ని మించిన ఎవరైనా ఓ వ్యక్తి’ అని చెబుతున్నారు. ఇక టర్కిష్ భాషలో 'అకాయ్' అంటే 'ప్రకాశవంతమైన చంద్రుడు' అని అర్థమని నెటిజన్లు చెబుతున్నారు. అయితే తమ బాబుకి అకాయ్ అని పేరు పెట్టడానికి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులు ఏ పదాన్ని మూలంగా తీసుకున్నారో ఇంకా ధ్రువీకరించలేదనే విషయం తెలిసిందే.
కాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. గంట వ్యవధిలో ఐదు మిలియన్లకు పైగా లైక్‌లను అందుకుంది. క్రీడా, సినీ రంగంలోని ఇరువురి ఫ్యాన్స్ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. నటుడు రణవీర్ సింగ్, నటి రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు పలువురు ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా శుభాకాంక్షలు తెలిపింది.