Medaram Jatara: మేడారం జాతర బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
- మేడిపల్లి అటవీ ప్రాంతంలో లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
- లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలు.. 108 లో ఆసుపత్రికి తరలింపు
- బస్సులోని 50 మంది ప్రయాణికుల్లో పలువురికి గాయాలు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులను తీసుకెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. దీంతో లారీ డ్రైవర్ తీవ్ర గాయాలపాలు కాగా.. బస్సులోని ప్రయాణికుల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంచిర్యాల నుంచి మేడారం వెళుతున్న ఆర్టీసీ బస్సు మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో బొగ్గు లారీని ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
మేడారం జాతర కోసం స్పెషల్ గా నడుపుతున్న బస్సు కావడంతో ప్రయాణికులు పరిమిత సంఖ్యలో ఉన్నారు. ప్రయాణికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ప్రయాణికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది.. లారీ డ్రైవర్ తో పాటు గాయాలపాలైన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.