Bandaru Satyanarayana: సాక్షిలో పని చేసే వారికి రేపు ఎవరు భద్రత కల్పిస్తారు?: బండారు సత్యనారాయణ
- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడిని ఖండించిన బండారు
- సాక్షి నుంచి ఉద్యోగులు బయటకు రావాలని సూచన
- జగన్ విశాఖకు వస్తే కర్ఫ్యూ వంటి పరిస్థితి ఉండటం ఏమిటని ప్రశ్న
- గుడివాడ అమర్ నాథ్ కు టికెట్ కూడా రాలేదని ఎద్దేవా
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ, ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. రెండు నెలల తర్వాత తాము అధికారంలోకి వస్తామని... అప్పుడు సాక్షిలో పని చేస్తున్న సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. టీడీపీ - జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. రేపు సాక్షికి కూడా ఇదే గతి పడుతుందని చెప్పారు. అవినీతి సొమ్ముతో సాక్షిని స్థాపించారని... ఆ సంస్థ నుంచి ఉద్యోగులు బయటకు రావాలని సూచించారు.
శారదాపీఠంకు వస్తే విశాఖలో ఇన్ని ఆంక్షలు పెట్టడం ఏమిటని బండారు ప్రశ్నించారు. ఈవెంట్ మేనేజర్ ను పెట్టి రోడ్డు మీద ప్రజలను ఎండలో నిలబెట్టారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు నుంచి శారదాపీఠం వరకు రోడ్డుపై ఉన్న టీడీపీ జెండాలను పోలీసులు పీకేశారని... కేవలం వైసీపీ జెండాలను మాత్రమే ఉంచారని విమర్శించారు. ముఖ్యమంత్రి వస్తే కర్ఫ్యూ వంటి పరిస్థితిని తీసుకొస్తున్నారని అన్నారు. టీవీ ఛానల్స్, పత్రికల ప్రతినిధులపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. గుడివాడ అమర్ నాథ్ కు టికెట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.