Cotton Candy: పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం
- ఇప్పటికే నిషేధించిన తమిళనాడు, పుదుచ్చేరి
- శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపాలని ఏపీ ప్రభుత్వ ఆదేశం
- వీటికి ఉపయోగిస్తున్న రంగులతో క్యాన్సర్ వస్తుందన్న ఆహార భద్రత కమిషనర్ నివాస్
సాధారణంగా చిన్న పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా పీచుమిఠాయిని చూస్తేనే నోరూరుతుంది. అయితే వీటిని తినడం వల్ల పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుందంటూ తమిళనాడు, పుదుచ్చేరిలో నిషేధం విధించారు. తాజగా పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఆరోగ్య, రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ... పీచుమిఠాయిలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు చేస్తున్నారని, ఇది క్యాన్సర్ కారకమని తెలిపారు. రోడమైన్ బీ, మెటానిల్ ఎల్లో వంటి రంగులు ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పారు. నమూనాల సేకరణ, పరీక్షల ప్రక్రియలకు నెల రోజుల సమయం పట్టొచ్చని తెలిపారు. కృత్రిమ రంగు లేని పీచుమిఠాయిలను తినడం కూడా సరైనది కాదని.. అపరిశుభ్ర పరిస్థితుల్లో వీటిని తయారు చేస్తారని చెప్పారు. ప్రస్తుతం పండుగలు, జాతరలు ఉండటంతో వీటి అమ్మకాలు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.