Jupudi Prabhakar Rao: కుప్పంలో నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై జూపూడి ప్రభాకర్ రావు స్పందన
- కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
- ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ భువనేశ్వరి వ్యాఖ్యలు
- చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నాడా అంటూ జూపూడి వ్యాఖ్యలు
కుప్పంలో ఇన్నాళ్లు చంద్రబాబును గెలిపించారు, ఈసారి నన్ను గెలిపిస్తారా? అంటూ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. అవి సరదాగా చేసిన వ్యాఖ్యలు అని భువనేశ్వరి స్పష్టం చేసినప్పటికీ, వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ స్పందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు కూడా మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నాడా? అంటూ జూపూడి సందేహం వెలిబుచ్చారు. "అదే నిజమైతే... నాడు అసెంబ్లీలో వెక్కి వెక్కి ఏడుస్తూ, మళ్లీ ముఖ్యమంత్రిని అయితే తప్ప సభలో అడుగుపెట్టనని నువ్వు (చంద్రబాబు) చేసిన శపథం ఏమవుతుందో చూసుకో... మీ ఆవిడతో దాన్ని పూరిస్తానంటే పూరించుకో... మాకెలాంటి అభ్యంతరం లేదు. నువ్వు ఆ నియోజకవర్గం నుంచి పారిపోతున్నదే నిజమైతే ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రగిరి నుంచి కుప్పం వచ్చావు... కుప్పం నుంచి తిప్పం వెళతావా?
లేకపోతే ఇది భువనేశ్వరి గారి వెన్నుపోటా? మా నాన్నకి వెన్నుపోటు పొడిస్తే నీకు పొడవమా అని పొడుస్తుందా? లోకేశ్, భువనేశ్వరి కలిసి ఏమైనా కుట్ర పన్నారా? తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోందనేది మాకు అనవసరం. పవన్ కల్యాణ్ చొరబడ్డాక టీడీపీలో సీనియర్లు ఎటు పోతున్నారో మాకు అనవసరం.
ఎన్డీయేలో చేరేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు... 4:2:1 అంటూ అమిత్ షా చేసిన ప్రతిపాదన దెబ్బకు నోరు మెదపకుండా తిరుగుతున్నాడు. ఈ విషయంలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ నేతలకు, టీడీపీ ఆశావహులకు సమాధానం చెప్పాలి... నువ్వు ఎన్ని సీట్లలో నిలబడుతున్నావు? పవన్ కల్యాణ్ కు ఎన్ని సీట్లు ఇస్తున్నావు? బీజేపీకి ఎన్ని ఇస్తున్నావు? 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని తుంగలో తొక్కేస్తున్నావా?" అంటూ జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు