Anand Mahindra: 3డీ ప్రింటర్ నాజిల్‌తో జిలేబీలు.. అద్భుత వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- జిలేబీలు వేసే పరికరం వీడియోను షేర్ చేసిన మహీంద్రా
- ఈ విధానం తనకు అంతగా నచ్చలేదని వ్యాఖ్య
- సంప్రదాయక పద్ధతిలో జిలేబీలు వేయడం ఓ కళ అని కామెంట్
నెట్టింట నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నేడు మరో ఆశ్చర్యకర వీడియోను తన ఫాలోవర్లతో పంచుకున్నారు. జిలేబీలు వేసే పరికరం తాలూకు వీడియోను ఆయన షేర్ చేశారు. ఇది నెటిజన్లను అమితంగా ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరికరంలోని 3డీ ప్రింటర్ నాజిల్ గుండ్రంగా తిరుగుతూ ఉంటే అందులోంచి పిండి సుడులు తిరుగుతూ నూనెలో పడుతోంది. ఇది చూసి జనాలు సర్ప్రైజ్ అవుతున్నారు. అయితే, తనకు మాత్రం ఈ టెక్నాలజీ అంతగా నచ్చలేదని ఆనంద్ మహీంద్రా కుండబద్దలు కొట్టారు.
‘‘నాకు టెక్నాలజీ అంటే ఇష్టమే కానీ ఈ దృశ్యం అంతగా రుచించలేదనే చెప్పాలి. చేతుల్లోంచి పిండి నూనెలో పడుతూ ఉంటేనే చూడటానికి బాగుంటుంది. నా దృష్టిలో అదో కళ. బహుశా పాతపద్ధతులంటేనే నాకు మక్కువ ఏమో’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.
ఈ వీడియోపై సహజంగానే జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. తమకు తెలిసిన ఇలాంటి యంత్రాల వీడియోలను కొందరు షేర్ చేశారు. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి పరికరాలు కామన్ అన్నారు. కానీ, మనుషులు తమ స్వహస్తాలతో చేసే ఫుడ్‌కు ఇవి సాటిరావని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది.