iPhone: ఐఫోన్ పోతే ఆపిల్ బాధ్యత వహించదు: సుప్రీంకోర్టు
- ఐఫోన్ పోగొట్టుకున్న ఒడిశా వ్యక్తి
- ఐఎంఈఐ నెంబరు ద్వారా తన ఫోన్ వెతికిపెట్టాలని ఆపిల్ ను కోరిన వ్యక్తి
- అది తమ పనికాదన్న ఆపిల్
- వినియోగదారుల ఫోరం తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన ఆపిల్
ఐఫోన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తికి చెందిన ఐఫోన్ పోతే దాన్ని ఎక్కడుందో వెతికిపట్టుకునే బాధ్యత ఆపిల్ ది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐఫోన్ పోగొట్టుకున్నవారే బాధ్యత వహించాలని ఓ కేసులో తీర్పు ఇచ్చింది.
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్ల కిందట ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఫోన్ కొనే సమయంలోనే థెఫ్ట్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నారు. అయితే, అతడి ఐఫోన్ పోవడంతో పోలీసులకు, ఆపిల్ సంస్థకు ఫిర్యాదు చేశాడు.
ఐఎంఈఐ నెంబరు ఆధారంగా ఆపిల్ తన ఫోన్ ను వెతికి పట్టుకుంటుందని ఆ వ్యక్తి ఆశించాడు. కానీ, ఆపిల్ ఆ పని తనది కాదని ఐఫోన్ జాడ తెలుసుకునేందుకు నిరాకరించింది. దాంతో అతడు జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫోరం ఆ ఫోన్ ను వెతికే బాధ్యత ఆపిల్ దేనని పేర్కొంది. దీనిపై ఆపిల్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... ఐఫోన్ పోగొట్టుకున్నవారే బాధ్యత వహించాలని, పోయిన ఫోన్ కు ఆపిల్ సంస్థ బాధ్యత వహించదని తన తీర్పులో వెల్లడించింది. చోరీకి గురైన ఫోన్లను వెతికిపట్టుకోవాలని ఆయా మొబైల్ తయారీ సంస్థలను కోరడం సరైనది కాదని, అందుకు వాటిని బాధ్యులుగా చేయలేమని అభిప్రాయపడింది.