Chalo Secretariat: రేపు ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్... నేతల గృహనిర్బంధంపై షర్మిల ఫైర్
- మెగా డీఎస్సీ కోరుతూ ఫిబ్రవరి 22న కాంగ్రెస్ పార్టీ సచివాలయ మార్చ్
- కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధంలోకి తీసుకుంటున్న పోలీసులు
- ఆంధ్రరత్న భవన్ లోనే ఉండిపోయిన షర్మిల
నిరుద్యోగ సమస్యలపై, ముఖ్యంగా డీఎస్సీ విషయంలో ఏపీ కాంగ్రెస్ రేపు (ఫిబ్రవరి 22) ఛలో సెక్రటేరియట్ పేరిట సచివాలయ మార్చ్ చేపట్టాలని నిర్ణయించింది. యువతకు అన్యాయం జరుగుతోందంటూ కాంగ్రెస్ వర్గాలు ప్రభుత్వానికి వినతిపత్రం అందించాలని భావించాయి.
అయితే, ఛలో సెక్రటేరియట్ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఈ సాయంత్రం విజయవాడ చేరుకోగా, ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లోనే ఉండిపోయారు.
వాస్తవానికి ఆమె అంపాపురంలోని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు నివాసంలో బస చేయాల్సి ఉంది. గృహ నిర్బంధాల నేపథ్యంలో ఈ రాత్రి పార్టీ కార్యాలయంలోనే ఉండి, రేపు ఛలో సెక్రటేరియట్ కు సమాయత్తం కానున్నారు.
ఏపీ ప్రభుత్వం ఇటీవల 6,100 టీచర్ పోస్టులతో డీఎస్సీ ప్రకటించింది. అయితే, ఇచ్చిన హామీ మేరకు పాతిక వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
కాగా, కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? అంటూ ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? నేను ఒక మహిళనై ఉండి హౌస్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా? అని నిలదీశారు.
"మేము తీవ్రవాదులమా... లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే... మాకు భయపడుతున్నట్లే కదా అర్థం. మీ అసమర్థతను కప్పిపుచ్చాలని చూస్తున్నట్లే కదా! అసలు వాస్తవం ఇదే.
మమ్మల్ని ఆపాలని చూసినా, ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికేడ్లతో బంధించాలని చూసినా, నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు" అని స్పష్టం చేశారు.