K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
- ఈ నెల 26న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని నోటీసులు
- తన ఇంట్లోనే విచారణ చేపట్టాలంటూ కవిత గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్
- ఈ పిటిషన్‌పై విచారణ ఈ నెల 28కి వాయిదా, ఈలోపే సీబీఐ నోటీసులు
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి సీబీఐ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 26న ఢిల్లీకి రావాలని పేర్కొంది. గతంలో ఈడీ విచారణ సందర్భంగా తనను ఇంట్లోనే విచారించాలంటూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది. దీంతో, కవిత న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీ మద్యం అమ్మకాల పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని సీబీఐ పేర్కొంది. మరోవైపు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేశారు.
మరోవైపు, ఈ కేసులో కవిత చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిలను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, మాగుంట రాఘవరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారగా వారిద్దరికీ బెయిల్ మంజూరైంది. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని రామచంద్ర పిళ్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగతావారు జైల్లోనే ఉన్నారు. ఇక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు వచ్చి కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం ఆమెను ఢిల్లీలో విచారించారు. అయితే, మహిళను ఆమె ఇంట్లోనే విచారించాలన్న వెసులుబాటు చట్టంలో ఉందంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉండగానే ఢిల్లీకి రావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది.