Rahul Gandhi: ఐశ్వర్యరాయ్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఆగ్రహం
- రామమందిర ప్రారంభోత్సవానికి దళితులకు ఆహ్వానం అందకపోవడంపై రాహుల్ విమర్శలు
- పారిశ్రామికవేత్తలు, అమితాబ్ బచ్చన్ వంటి వారిని ఆహ్వానించి మిగతావారిని అవమానించారని కామెంట్
- ఐశ్వర్య డ్యాన్స్ చేస్తే అమితాబ్ బల్లే బల్లే అంటారంటూ మరో ర్యాలీలో కామెంట్
- మహిళలను రాహుల్ కించపరిచారంటూ విమర్శలు
ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పలువురు రాజకీయనేతలు, సినీ తారలు రాహుల్ గాంధీని దుయ్యబడుతున్నారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో ఆయన రామమందిర ప్రారంభోత్సవం గురించి మాట్లాడారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దళితులు, వెనకబడిన వర్గాలు కనిపించకపోవడాన్ని ఆయన పేర్కొన్నారు. కనీసం రాష్ట్రపతి కూడా లేకపోవడం ఆయా వర్గాలను అవమానించడమేనని అన్నారు. పారిశ్రామికవేత్తలు, అమితాబచ్చన్‌ను ఆహ్వానించడం ద్వారా జనాభాలో మిగతా 73 శాతం మందికి ప్రాముఖ్యత లేదని చెప్పినట్టయిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆ తరువాత మరో ర్యాలీలో మాట్లాడుతూ ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుంటే, అమితాబ్ బల్లే బల్లే అంటారని కామెంట్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ మహిళలను అవమానించారంటూ సినీగాయని సోనా మొహాపాత్ర మండిపడింది. రాహుల్ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ కన్నడిగులను అవమానించారని మండిపడింది. కన్నడ ఆత్మగౌరవం గురించి మాట్లాడే సీఎం సిద్దరామయ్య.. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తారా? అని ప్రశ్నించింది. సాటి కన్నడ వ్యక్తిని రాహుల్ అవమానిస్తుంటే సీఎం సిద్దరామయ్య చూస్తూ ఎలా ఊరుకుంటారని మండిపడింది.